పార్టీని నడపడం ఈజీ కాదు జనసేన…..

ఈ దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులలో ఓ రాజకీయ పార్టీ ని నడపడం అంటే అంత ఈజీ కాదన్నది వాస్తవం. పెరుగుతున్న ధరలే కాదు…. జనాలను ఇప్పటికే పూర్తిగా అనుచితాలు లేకుండా ఉచితాలతో ముంచెత్తిన పార్టీలు… వాళ్లని మరింత ఉచిత మత్తులోకి తీసుకెళ్తునే ఉన్నాయి. ఎన్నికలనగానే… లక్షల కోట్లు వెదజల్లి ఓట్లు పట్టడమే సంప్రదాయంగా మార్చేసాయి. ఇందుకు ఆ పార్టీ ఈ పార్టీ అని పేర్లు పెట్టి నిందించుకోవటం అనవసరం అనే చెప్పకతప్పదు.
ఇలాంటి స్థితిలోనే వచ్చిన ప్రజారాజ్యం పార్టీ… ఉదయించిన సూర్యుడిలా ఆవిర్భావించి, అంతే వేగంతో అర్ధంతరంగా అస్తమించింది. నిజానికి అభిమానులే అలంబనగా అధికారం అందుకోగలమన్నభావన అడుగడుగునా వ్యక్తం చేస్తూ ముందుకు సాగింది. వెండితెర ఇలవేల్పుగా ఉన్న మెగాస్టార్ కోట్లలో ఉన్న తన అభిమానులంతా ఓట్లేసేస్తే గెలుపు సునాయాసం అని అనుకున్నా, తీరా బ్యాలట్ బాక్స్ దగ్గరకి వచ్చేసరి ఆ పని జరగలేదు. అందుకే అప్పటి ఎన్నికల సమయంలో చిరంజీవి సభలకు ఊహించనంత మంది జనం వచ్చి నీరాజనాలు పట్టినా గెలుపు ముంగిటకు వచ్చేసరికి 18 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇందుకు వైఎస్ విసరిన ఉచిత విద్యుత్ అస్త్రం ప్రధాన కారణమనే చెప్పాలి. ఇది అటు టిడిపిని సైతం బలంగా తాకి మళ్లీ విపక్షానికే పరిమితం చేసింది. కాల క్రమంలో ప్రజారాజ్యాన్ని నడిపే పరిస్థితి లేక అధికార కాంగ్రెస్‌తో ఓ ఒప్పందానికి వచ్చి, విలీనం చేసి తన పరివారానికి రాష్ట్రంలో పదవులు, తను ఓ కేంద్ర మంత్రి పదవి తీసుకుని ఆ పార్టీ జెండా పీకేశారు చిరంజీవి. నిప్పులు చెరిగిన పార్టీతోనే గప్‌చిప్‌గా పని కానిచ్చేసారు.
ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఆవిర్భవించిన జనసేన పరిస్థితి కూడా అలానే కనిపిస్తోంది. అన్నకు తగ్గ తమ్ముడే కదా అన్న వాదనలూ బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలానే ఉంది. జనసేన ఆవిర్భావ పరిస్థితి, అప్పటి జనసేనాని పవన్ కళ్యాణ్ మాటలు ఓ సారి ఆకళింపు చేసుకుంటే అధికారం కాదు లక్ష్యం, ప్రశ్నించి పనులు చేయించడమే ముఖ్యంగా రంగంలోకి దిగింది. ఏ పార్టీ అయినా ఆవిర్భవించే ముందు దానికి ఓ లక్ష్యం, అందుకు తగ్గట్టు గమ్యాన్ని చేరుకునేలా విధి, విధానాలు, సిద్ధాంతాలు, అందుకు తగ్గట్టు బలమైన పార్టీ శ్రేణులు, సంస్ధాగతంగా పార్టీ నిర్మాణం ఇలా అన్నింటినీ చూసుకుంటూ ముందుకు నడిపేలా చూడాల్సిన బాధ్యత కీలకం. అయితే సినిమా హీరో పార్టీ కదా? ఆతని క్రేజ్‌తో గెలిచేద్దాం అనుకుని వచ్చేవాళ్లకీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో జనసేనాని నిర్ణయం అవాక్కయ్యేలా చేసింది. ఆ ఎన్నికలలో బీజేపీ-టీడీపీ మిత్రపక్షానికి మద్దతు ఇచ్చిన ప్రచారం కూడా చేసాడు. దీంతో ప్రశ్నించేందుకు అనే పదం ఆవశ్యకత పోయింది. కొందరు దీన్ని తప్పటడుగు అని అనుకున్నా… అధికార పార్టీతో జనం సమస్యలు తీర్చే క్రమం జరుగుతుందన్నది పవన్ విశ్వాసం. అది కొంత మేర నెరవేర్చుకున్నాడు కూడా అనటంలో సందేహమే అవసరం లేదు.
అయితే 2019 నాటికి బిజెపి, టిడిపిలు ఎడముఖం పెడ ముఖం కావటంతో పవన్‌కళ్యాణ్ కూడా ఇటు టిడిపిపై అవినీతి ఆరోపణలు సంధిస్తునే, ఇటు బిజెపి రాష్ట్రానికి ఇస్తామన్న హోదా, నిధుల విషయంలో మోసం చేసిందని పాచిపోయిన లడ్లుతో పోల్చి మరీ విమర్శలు బాణాలు సంధించడం ఆరంభించారు. ఈ ఎన్నికల ప్రచారంలో నిన్నటి వరకు మిత్రులుగా ఉన్న వారిపైనే యుద్ధం కొనసాగించారు.
ఇక తామే అధికారంలోకి రావటమే తరువాయన్న తీరుగా అభిమానులతో సిఎం., సిఎం… అంటూ అడిగి మరీ నినాదాలు చేయించుకున్నారు. కానీ అంతర్లీనంగా జగన్ పాదయాత్ర, ఉచితాల ప్రభావం చాలానే ఉంది. జగన్‌పై పవన్ చేసిన విమర్శలను జనం లైట్ తీసుకోవటంతో ఎన్నికలలో తను రెండు స్థానాలలో పోటీ చేసి ఓడిపోవాల్సిన పరిస్తితి ఎదుర్కొనాల్సి వచ్చింది. ఇందుకు లక్షలాది కోట్లు ఎన్నికలలో వెదజల్లడమే కారణమని ఎంత చెప్పుకున్నా… అధికారంలోకి వస్తే ఉపాధి కల్పిస్తామని చెప్పాల్సిన పార్టీలు ఉచిత పథకాలే ఎక్కువ గా ప్రచారం చేయటం, గత పాలకుల కన్నా పుట్టిన పురిటి చిన్నారి , బడికి వెళ్లే పిల్లాడి నుంచి వయో వృద్ధుల వరకు ఎవరి ఖాతాలలో వారికి భారీ మొత్తాలు ప్రభుత్వ పరంగా అందిస్తామని ప్రకటించుకోవటం కూడా పవన్ పరివారాన్ని కేవలం ఒకే ఒక్క సీటుకు పరిమితం చేసింది అని చెప్పకతప్పదు.
పార్టీలు అన్నాక అయారాం… గయారాంలు ఉండటం సర్వసాధారణం. అయితే ఇతర పార్టీల నుంచి, పార్టీ విధి విధానాలు మెచ్చి వచ్చి చేరే వాళ్లు వరుసగా తిరిగి వెళ్లిపోతున్నప్పుడు లోపాలెక్కడ ఉన్నాయి, వాటిని సవరించుకోవాలసిన బాధ్యత పార్టీ అధినేతలపై ఉంటుంది. దీనిని కొందరు బుజ్జగింపులతోనూ సరిపెడుతుంటారు. అయితే జనసేనలో ఆ తరహా బుజ్జగింపులు కాదు సరికదా… ఉంటే ఎంత… పోతే ఎంత అనే తరహా వ్యవహారమే పార్టీ నుంచి వరుస రాజీనామాలకు కారణంగా కనిపిస్తోంది.
జనసేన ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి బలమైన మద్దతుదారుడిగా మీడియాలో సహా ఎక్కడైనా పార్టీ స్వరాన్ని వినిపించి ధీటుగా నిలిచిన దిలీప్ సుంకర ను పార్టీ నుంచి బైటకు పంపేసే వరకు కొందరు పనికట్టుకుని చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. అతను పార్టీకి దూరమయ్యాడన్న మరుక్షణం అద్దేపల్లి శ్రీధర్ వంతు వచ్చింది. ఎన్నికలకు ముందు నుంచే జనసేన రైలు నుంచి ఓడిపోయిన తర్వాత ఒక్కొక్కరుగా దిగుతూ వస్తున్నారు. పవన్‌కి అనుంగు అనుచరుడిగా ఉన్న రాజు రవితేజ పార్టీని వీడటమే కాదు కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నాడని ఘాటైన విమర్శలకూ తెరలేపాడు. పార్టీనుంచి బైటకు వెళ్లే నేతలు పార్టీపై విమర్శలు చేయటం సర్వసాధారణం అని అనుకున్నజనసేన కు రాజీనామా చేస్తున్న వారంతా చెప్పేదొక్కటే… అధినేత నిలకడలేని తనం అనే… కావటం విశేషం.
ఈ క్రమంలోనే ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా జనసేన నుంచి దూరమై ఆడో టైపు… నేనోటైపు… అన్నట్టు జగన్‌కు జైకొడుతుండటం గమనార్హం. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే వైసిపిలో చేరిపోయేందుకు రాపాక రంగం సిద్దం చేసుకున్నాడన్నది వాస్తవం. దీంతో చేసింది లేక నోటీసులతో సరిపుచ్చడం కూడా జనసేనాని నిలకడలేని తత్వమే కారణమన్నది రాజకీయ విశ్లేషకులు చెపుతున్న మాట.
జగన్ కేసుల విషయంలో సీబీఐ అధికారిగా అత్యంత పాపులారిటీ సంపాదించుకున్న ఐపిఎస్ అధికారి లక్ష్మినారాయణ పార్టీలో చేరి నాటి నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటునే ఉన్నారు. విశాఖ ఎంపీగా పోటీ చేసినా… గాజువాకలో పవన్ శాసనసభ్యత్వం కోసం రంగంలోకి దిగినా, ఉచిత పథకాల ముందు చతికిల్లపడాల్సి వచ్చింది. అప్పటి నుంచి పార్టీకి దూరంగా జరుగుతూ తన మార్కు కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్న లక్ష్మీ నారాయణని ఆ పై పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానించడం తగ్గించేసారు. దీనికి తోడు పవన్ చెప్పేదొకటి చేసేదొకటి అన్న భావన సర్వత్రా నెలకొని, పార్టీని బిజెపిలో కలపేస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో అంతర్గత సమావేశాలలో సైతం పాచిపోయిన లడ్లు అని పదే పదే విమర్శించిన పార్టీతోనే తిరిగి స్నేహం అందుకోవటం లక్ష్మీనారాయణకు నచ్చలేదు.
పార్టీలో నాదెండ్ల మనోహర్ పెద్దరికం పెరిగిపోవలం కూడా చాలా మంది నేతలకు ఇబ్బందిగా మారింది. సమయం కోసం ఎదురు చూస్తున్న లక్ష్మీనారాయణకు ఇటీవల వరుసగా పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాలలోకి వస్తున్నట్టు నిర్మాతలు చెప్పిన వార్తలే కాదు, చిత్రాల షూటింగ్‌లు గోప్యంగా జరుగుతున్న తీరు, పవన్ షూటింగ్లో పాల్గొన్న ఫోటోలు సామాజిక మీడియాలో హల్చల్ చేయటం కలసి వచ్చింది. దీంతో పూర్తికాల రాజకీయాలకే పరిమితం, ఇక సినిమాలు చేయనంటూ పవన్ చెప్పిన మాటలనే గుర్తు చేస్తూ గురువారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ప్రకటించాడు. పవన్‌లో నిలకడలేని తత్వం వల్లే రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆయన రాజీనామా లేఖలో పేర్కొనడం విశేషం. ఇక రేపోమాపో ఐఏఎస్ ఆఫీసర్ తోట చంద్రశేఖర్ కూడా లక్ష్మినారాయణ బాటలో నడవవచ్చనే సంకేతాలు అందుతున్నాయి.
ఏతా వాతా తేలిందేంటంటే… రాజకీయ పార్టీలు నడపాలంటే దండిగా డబ్బులుండాలి… కనుక ఏదో ఒకటి చేయాలి. పవన్ ఇందుకు అనుగుణంగా తనకు తెలిసిన సినిమాలను ఎంచుకున్నాడన్నది జనసేన, మెగా ఫ్యాన్స్ చెపుతున్నా… తొలిరోజులలో ఈ అంశమే చెప్పి ఉంటే బాగుండేదన్నది విజ్ఞుల మాట. అర్ధిక పరిపుష్టికి సినిమాలలో పవన్ నటిస్తున్నాడని అనుకున్నా, పార్టీని సంస్ధాగతంగా బలోపేతం చేసే మరోనాయకుడు కనిపించడం లేదు. నాదెండ్ల మనోహర్ లాంటి సీనియర్లతోడు ఉందనుకున్నా, ఆయన పవన్‌తో కలసి చెక్కర్లు కొట్టడానికే పరిమితం అవుతుండటం, అడపాదడపా మీడియాలో కనిపించడం మినహా పార్టీకి ఒరగిందేం లేదన్నదీ జనసైన్యం ఉవాచ. వరుస క్రమంలో పార్టీ నుంచి నేతలు బైటకు వెళ్లిపోతున్న తరుణంలో ఏమేరకు తనని తాను ప్రశ్నించుకుంటూ, నిర్ణయాలలో మార్పుల దిశగా చర్యలు తీసుకోకుంటే… పార్టీ మనుగడకే ప్రమాదం తప్పదన్నది ఓ హెచ్చరిక రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. మరి పార్టీని నడపడం అంత ఈజీ కాదని జనసేనాని ఎప్పటికి గుర్తిస్తాడో చూడాలి.