ఉపరాష్ట్రపతిని ఆడిపోసుకుంటున్నారుగా…

ఉప రాష్ట్రపతి పదవి రెండో అత్యున్నతపదవి. ఆ పదవిలో వున్నవాళ్లు ఆచితూచి మాట్లాడాల్సివుంటుంది. రాజ్యాంగ పదవిలో వున్నవాళ్లు వివాదాస్పద అంశాల్లో సాధ్యమైనంతవరకు బహిరంగంగా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తపరచకుండా ఉంటే మంచిది. ఈ సూత్రం తెలియని వ్యక్తి కాదు ప్రస్తుతం దేశానికి ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడుగారు. ఆమన తనలోని భావోద్రేకాలను ఆపుకోలేక పోతున్నారు. తను ఇంకా రాజకీయనాయకుడిగానే అడపా దడపా మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు. .
అంతకుముందు ఏ రాజకీయ పార్టీకి చెందినా , ఎటువంటి అభిప్రాయాలున్నా ఒకసారి ఉన్నతపదవిలోకి, అదీ రాజ్యాంగపదవిలోకి వెళ్ళినతర్వాత తను అందరివాడు అనే చెప్పాలి. అందునా తెలుగు వాడు అటువంటి వున్నత స్థానంలో వున్నప్పుడు ప్రతి తెలుగువాడు తన వాడు అనుకుంటారు. నిజానికి వెంకయ్య నాయుడు ఉన్నత పదవిలో ఉన్నా ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరువెళ్లినా పార్టీలతో నిమిత్తం లేకుండా, తక్షణమే స్పందించి మంచి చెడ్డలు వినేందుకు కూడా సమయం కేటాయిస్తారన్న మంచి పేరుంది. అయినప్పటికీ ఈ మధ్య ఆయన అనవసరంగా వివాదాస్పద విషయాల్లో కి వెళ్లిపోతున్నట్టు అనిపిస్తుంది.
ఆమధ్య మాతృభాషలో విద్యాబోధనపై తన అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా వ్యక్తపరిచారు. దానికి ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి ప్రతిస్పందించి తన పిల్లలు ఏ మీడియం లో చదివారని ప్రశ్నించడంతో వివాదం పెద్దదైంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి కూడా మాతృ భాషలో విద్యాబోధనపై మాట్లాడటంతో వైసిపి నేతలు దానిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసి, చివరకి మూల పడేసారు విజయవంతంగా.
తాజాగా మూడు రాజధానులపై స్పందించిన వెంకయ్య తన అభిప్రాయం వ్యక్తపరిచాడు. దీనిపై ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విధానపర నిర్ణయంపై ఉపరాష్ట్రపతి స్థాయిలో వున్న వ్యక్తి బహిరంగంగా మాట్లాడటం ఎంతవరకు సబబంటూ వైసిపి వర్గాలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. ఉపరాష్ట్ర పదవిలో ఉన్నంత మాత్రాన రాష్ట్రంలో విపరీత పరిణామాలు చోటు చేసుకుంటే ఆ పదవిలో వున్నంతకాలం నోరు మెదపకుండా ఉండాలని కొందరు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై సామాజిక మీడియాలోనూ వైసిపి వర్గాలు ట్రోల్ చేస్తున్నాయి. పాలనా వికేంద్రీకరణకి, అధికార వికేంద్రీ కరణకి తేడా తెలియనివాళ్లంతా ఇష్టాను సారంగా ఉపరాష్ట్రపతిని ఆడిపోసుకుంటున్నట్టు కనిపిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.