రాజధానిని మార్చే హక్కు సీఎం జగన్‌కు లేదు


అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణకు టీడీపీ మద్దతిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రకటించారు. టీడీఎల్పీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాము అభివృద్ధి వికేంద్రీకరణకు తప్ప పరిపాలన వికేంద్రీకరణకు మద్దతు పలకడంలేదని స్పష్టం చేశారు. 

విభజన చట్టంలో 3 రాజధానుల ప్రస్తావనే లేదని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతోనే.. అమరావతిని రాజధానిగా ఎంపిక చేశామని చెప్పారు. రాజధానిని మార్చే హక్కు సీఎం జగన్‌కు లేదని తేల్చిచెప్పారు. ప్రజా బ్యాలెట్‌లో 98 శాతం అమరావతికే ఓటేశారన్నారు. వైసీపీ నేతలు ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేసి.. అమరావతిని అంధకారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతిని మారుస్తామని జగన్‌ మేనిఫెస్టోలో పెట్టారా? అని నిమ్మల ప్రశ్నించారు. రాజధాని మార్పుపై 175 నియోజకవర్గాల్లో రెఫరెండం పెట్టాలని డిమాండ్ చేశారు. జగన్‌, సజ్జల, విజయసాయిరెడ్డి కలిసి రాష్ట్ర భవిష్యత్‌ని నిర్ణయిస్తారా? అని నిలదీశారు. వైసీపీ నేతలు పొంతన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. అమరావతిపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరగాలని రామానాయుడు డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లాలకు, జిల్లాల నుంచి మండలాలకు, మండలాల నుంచి పంచాయతీలకు అధికార పంపిణీ చేస్తే అది పరిపాలన వికేంద్రీకరణ అవుతుంది తప్ప, నాలుగు భవనాలు అమరావతిలో, నాలుగు భవనాలు విశాఖలో, మరో భవనం కర్నూలులో ఏర్పాటు చేస్తే అది పరిపాలన వికేంద్రీకరణ అనిపించుకోదని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో జరగాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ అని, టీడీపీ అలాంటి వికేంద్రీకరణకే మద్దతుగా నిలబడుతుందని వివరించారు. అమరావతి సంపద 13 జిల్లాలకు వెళ్లాలన్నారు. తద్వారా 13 జిల్లాలు అభివృద్ధి చెందాలన్నది తమ అభిమతమని చెప్పారు. విశాఖపట్నం ఇప్పటికే ఆర్థిక రాజధానిగా ఉందన్నారు. టెక్నాలజీ, సినీ, పారిశ్రామిక రాజధానిగా విశాఖ పేరు తెచ్చుకుందని రామానాయుడు వివరించారు. రాయలసీమలో కియా మోటార్స్ ఉందని, అలాంటి అభివృద్ధితో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలే తప్ప అమరావతిని మూడు ముక్కలు చేయడం వల్ల రాష్ట్రాభివృద్ధి జరగదు సరికదా, అటు ఉత్తరాంధ్ర, రాయలసీమకు కూడా ఎలాంటి మేలు జరగదని అన్నారు. తాము ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే వైఖరికి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు.మేనిఫెస్టో తనకు బైబిల్, భగవద్గీత, ఖురాన్ వంటిదని చెబుతున్న జగన్‌ను.. ఏ అధికారంతో రాజధాని మార్చుతున్నారో రేపు అసెంబ్లీలో నిలదీస్తామన్నారు.  . 
 

Leave a Reply

Your email address will not be published.