ఢిల్లీలో చెలరేగిన అల్లర్లు..! జర్నలిస్టు మృతి

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య గొడవలతో దేశరాజధాని ఢిల్లీ అట్టుడుకుతోంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నా, శాంతిభద్రతలు అదుపులోకి రాకపోవటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈశాన్య ఢిల్లీలో విధ్వంస రచన సాగుతునే ఉంది, కాగా మౌజ్‌పూర్ ప్రాంతంలో వార్తా సేకరణకు వెళ్లిన ఓ జర్నలిస్టు తో పాటు ముగ్గురు పౌరులు కూడా దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. వీరే కాకుండా రాజధానిలో గత కొన్నాళ్లుగా జరుగుతున్న వివిధ ఘటనల్లో సుమారు 40 మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మంగళవారం మధ్యాహ్నం మౌజ్‌పూర్ ప్రాంతంలో వార్తల్ని సేకరించేందుకు ఢిల్లీలోని ఓ ప్రైవేటు చానెల్ కు చెందిన జర్నలిస్టు వెళుతుండగా కొందరు దుండగులు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెనువెంటనే ఆతనితో పాటు వచ్చిన సహచరులు ఆతనిని సమీపంలోని గురు తేగ్ బహదూర్(జీటీబీ) ఆస్పత్రికి తరలించగా, చికిత్స అందిస్తుండగానే ఆ జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. జర్నలిస్టు మృతిపై మీడియా సంస్థలు, జర్నలిస్టు సంఘాలు విచారం వ్యక్తం చేశాయి.
కాగా ఢిల్లీలో చెలరేగిన అల్లర్లు పై ఆందోళన వ్యక్తం చేస్తూ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నాయకత్వంలో జరిగిన హైలెవల్ మీటింగ్ మంగళవారం జరిగింది. హింస నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నెలలు అవుతున్న ఆందోళనలు, హింస అదుపులోకి రాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.