‘ఒక్క ముద్దు ఇవ్వండి పోప్’….‘కొరకనంటేనే’

వాటికన్ సిటీ పోప్ ఫ్రాన్సిస్ మరోసారి వార్తల్లో నిలిచారు. న్యూఇయర్ వేడుకల్లో చేయి లాగినందుకు ఓ మహిళ చేతిని కొట్టి వెనక్కి లాక్కోవడంతో అది వివాదాస్పదమైంది. అనంతరం పోప్.. ఆమెకు క్షమాపణ కూడా చెప్పారు. అదంతా జరిగిపోయిన కథ. తాజాగా ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. వేలాది మంది జనం గుమిగూడి ఉన్న హాల్ మధ్యలో పోప్ ఫ్రాన్సిస్ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో అరుపులతో హాలంతా సందడిగా మారిపోయింది. అరుపుల మధ్యలో ఓ నన్ గట్టిగా పిలిచింది. ‘ఒక్క ముద్దు ఇవ్వండి పోప్..’ అంటూ గట్టిగా కేక వేసింది. అది విన్న పోప్ ఒక్క క్షణం ఆగి తనను ‘కొరకనంటేనే’ ఇస్తానని బదులిచ్చారు. పోప్ జవాబుతో అక్కడున్న వారంతా ఘొల్లున నవ్వారు. ముందు నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. నేను నీకు ముద్దిస్తాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో నన్ను కొరకకూడదు’ అని చమత్కారంగా బదులిచ్చారు. దానికి నన్ సరేనంటూ మాటిచ్చింది. వెంటనే పోప్ ఆమె కుడి చెంపపై ముద్దు పెట్టారు. దీంతో పట్టలేని సంతోషంతో ఆ మహిళ ‘థ్యాంక్యూ పోప్’ అంటూ గంతులు వేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.