ఏపి ప్రభుత్వానికి ఝలక్ ఇస్తున్న మందుబాబులు

ఏపి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పాలసీ లో మద్యం విక్రయాల ద్వారా డబ్బులు సమకూర్చుకోవటం తమపని కాదంటూ దశల వారీ మద్య నిషేదానికి శ్రీకారం చుట్టింది. మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహిస్తు, మూడో వంతు షాపులను మూల పెట్టేసింది. మద్యం తాగే అలవాటున్నవారికి అందనంత రేట్లు పెంచేసి, కోరుకున్న బ్రాండ్ కాకుండా తామిచ్చినదే తాగాలన్న పరిస్థితి తీసుకువచ్చింది. ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకే విక్రయిస్తున్నారు. పైగా పర్మిట్ రూమ్లనీ తీసేసారు. ఇవన్నీ చేయడం వల్ల మద్యం తాగేవాళ్లను నిరుత్సాహపరచవచ్చని ప్రభుత్వం భావించింది. అయితే మద్య నియంత్రణ శాఖ నుంచి రావాల్సిన నిధుల అంచనాలను మాత్రం గతంలో కన్నా పెంచేయటం గమనార్హం. దీంతో షాపులు తగ్గినా, మద్యం విక్రయాల్లో టార్గెట్లు అధిగమించి ఖజానాకి సొమ్ములు తరలించవచ్చన్నది ప్రభుత్వ యోచనగా కనిపిస్తుంటే, మందుబాబులు మాత్రం ప్రభుత్వానికి ఝలక్ ఇస్తున్నారు.
రాష్ట్రంలో మద్యంధరలు ఆకాశాన్నిఅందుతుండటంతో చేసేది లేక మందు బాబులంతా పక్కరాష్ట్రాల బాట పడుతున్నారు. ఇందుకు ప్రత్యేకంగా కిట్టిపార్టీలు, ఫ్యామిలీ టూర్లు వేసేసుకుంటున్నారు. ఈ తతంగాన్ని ఓ సారి పరిశీలిస్తే… ఏపీ సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ – ఒడిస్సాసరిహద్దుల్లో పెరుగుతున్న మద్యం షాపులు, బెల్టు షాపులే ఇందుకు ఉదాహరణ. మద్యం బాబులు తెలంగాణలోని మద్యం దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. అక్కడ మద్యం కొనుగోలు చేసుకుని వచ్చి ఏపీలో బహిరంగ ప్రదేశాల్లో సేవిస్తున్నారు. పొలాల్లో.. చెట్ల కింద కూర్చుని మద్యం సేవిస్తున్నారు. దీంతో పోలీసులు న్యూసెన్స్ కేసులు నమోదు చేస్తున్నా ఎక్కడా వెనక్కి తగ్గటం లేదు.
పశ్చిమ కృష్ణా కు చెందిన మద్యంబాబులు మందు తాగాలంటే తెలంగాణ వెళ్తుండగా, అనంతపురం, కర్నూలు వారంతా కర్నాటక సరిహద్దు గ్రామాల మీద ఆధారపడుతున్నారు. ఇక ఉత్తరాంధ్రా సరిహద్దులలో ఉన్న ఒడిస్సా వైన్ షాపులకు కాసుల పంట కురిపిస్తుంటే, ఉభయగోదావరి జిల్లాల మందుబాబులు యానాం వైపు పరుగులు తీస్తున్నారు. అంతెందుకు తెలంగాణ ప్రాంతంలోని ఎర్రుపాలెం మండలం కొత్తపాలెం గ్రామం చాలా చిన్న గ్రామమైననప్పటికీ ఏకంగా ఆరు బెల్టుషాపులున్నాయి. రోజుకు ఈ రూ.3 లక్షల వరకు విక్రయాలు జరుగుతున్నట్టు వీటి నిర్వాహకులే చెపుతుండటం గమనార్హం. ఇక కృష్ణా జిల్లా తిరువూరులో బార్ ఉన్నా.. అధిక ధరలు కావటంతో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెలంగాణ గ్రామాలలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలకు మద్యం ప్రియులు తరలిపోతున్నారు.
ఆంధ్రాలో మద్యం ధరల దెబ్బకు ఇతర రాష్ట్రాలకు కాసుల వర్షం కురిపిస్తోంది. సరిహద్దు గ్రామాల్లో బెల్టు షాపులు ఏర్పాటు కూడా జోరుగా సాగుతుండటం గమనార్హం. పక్కరాష్ట్రాలలో గొలుసు దుకాణానికి బారులు తీరుతున్న మందు బాబులను చూస్తు అబ్కారీ శాఖ అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నిర్దేశించిన అమ్మకాలు సాగక ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల రోజుకు 50 వేలు కూడా అమ్మకాలు జరగటంలేదని, సరిహద్దు రాష్ట్రాలలో ఉన్న గొలుసు షాపుల పాటి వ్యాపారం కూడా జరగక పోవటంతో ఉన్నతాధికారుల నుంచి తిట్లు తప్పవన్న భావన అబ్కారీ అధికారుల నుంచి వినిపిస్తోంది.
ఏది ఏమైనా ఏపి ప్రభుత్వం మద్య నిషేదం తీసుకురావటం హర్షణీయ పరిణామమే అయినా, సరిహద్దు రాష్ట్రాలకు మాత్రం అదనపు ఆదాయం అందించేలా కాసులు కురిపిస్తోందన్నది వాస్తవం.