తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘తలైవి’ చిత్రం

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో సిద్ధమవుతున్న చిత్రం ‘తలైవి’ . ఈ చిత్రానికి విజయ్ దర్శకత్వం వహిస్తుండగా, విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్. సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2020 జూన్ లో విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమాలో దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె. జయలలితకు నివాళిగా ఈ చత్రాన్ని తీర్చిదిద్దడంలో చిత్ర బృందం రాజీ పడటం లేదు.
ఇప్పటికే విడుదల చేసిన విజువల్ ప్రోమోస్, ఎంజీఆర్ గా అరవింద్ స్వామి లుక్ లకు అనూహ్య స్పందన రావటంతో తాజాగా సెల్వి జె. జయలలిత 72వ జయంతిని పురస్కరించుకొని జయలలిత పాత్ర చేస్తున్న కంగనా రనౌత్ కొత్త లుక్ ను సోమవారం విడుదల చేసారు. ఈ లుక్ లో ముప్పైలలో ఉన్న జయలలిత యంగ్ పొలిటీషియన్ గా కనిపిస్తోంది.
పోస్టర్ విడుదల ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మాట్లాడుతూ, “ జయలలిత అనేక మందికి స్ఫూర్తిగా నిలచే మనిషి… అలాంటి వ్యక్తి జీవితాన్ని కోట్లాది మందికి చేర్చే పనిని చేపట్టాం. ఆమె జయంతి సందర్భంగా ఆ లెజెండ్ ను గుర్తు చేసుకోంటూ ఆమె పాత్రను పోషిస్తున్న కంగనా లుక్ రిలీజ్ చేస్తున్నామన్నారు. కంగనా జయ పాత్రలో ఎంతో అంకితభావంతో నటిస్తోంది. ఆమె నటనే ఈ చిత్ర క్వాలిటీని ఎన్నో రెట్లు పెంచిందనిపిస్తోందని అన్నారు.
నిర్మాత విష్ణువర్ధన్ ఇందూరి మాట్లాడుతూ, హిందీలో మా మొదటి సినిమా ’83’ తర్వాత,మహిళా రాజకీయవేత్తలు లేని ఒక రాష్ట్రంలో తనకు ఎదురైన ఎన్నో అవరోధాలను పోరాడి, అనేక మందిని అధిగమించి, ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఒక స్త్రీ మూర్తి గాథ గా ఈ చిత్రాన్ని రూపొందించామని, జాతీయ స్థాయిలో చెప్పగల కథ ‘తలైవి’ అని అన్నారు.