చోరీ యత్నం తో ఏటిఎం లోషార్ట్ సర్క్యూట్

ఏటిఎంని చోరి చేసేందుకు కొందరు దుండగులు ప్రయత్నించగా అది కాస్తా షార్ట్ సర్క్యూట్ అయ్యి చివరకి ఏటిఎం మంటల్లో చిక్కుకున్న ఘటన అనంతపురం జిల్లాలలో జరిగింది. గురువారం వేకువ ఝామున అనంతపురం జిల్లా పెనుకొండ మడకశిర రోడ్ లో ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఎటిఎం చోరీకి కొందరు దుండగులు ప్రయత్నించి, విఫలమయ్యారు.
ఈ ఏటిఎంకు ఎలాంటి సెక్యూరిటీ లేక పోవటం, పండుగ హడావిడిలో అంతా ఇళ్లకే పరిమితం కావటంతో గురువారం తెల్లవారు ఝామున యాక్సిస్ బ్యాంక్ ఎటిఎంలోకి ప్రవేశించిన దుండగులు గ్యాస్ కట్టర్ సాయంతో ఏటీఎంని చిధ్రం చేసేందుకు ప్రయత్నించారు. అయితే అనూహ్యంగా మంటల వేడికి ఏటిఎంలోని వైర్లు ఒక్కసారిగా ఒకదానికి ఒకటి జతకావటంతో మంటలు చెలరేగాయి. ఈ హఠాత్ పరిణామానికి నిర్ఝాంత పోయిన దుండగలు చేసేది లేక అక్కడ నుంచి పరారయ్యారు.
ఏటిఎం నుంచి మంటలు వస్తున్న విషయాన్ని గుర్తించిన కొందరు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో వారు మంటలు అదుపు చేసారు. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు సంబంధిత సిసి ఫుటేజ్‌లు పరిశీలించగా గ్యాస్ కట్టర్‌తో ఏటిఎం నుంచి డబ్బులు తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్టు గుర్తించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు మీడియాకు చెప్పారు.