డి.హీరేహాళ్ జంట హత్యల కేసు ఛేదింపు

* కన్న కొడుకే ప్రధాన నిందితుడు… కొడుకు సహా ఇద్దరు అరెస్టు 
* పోలీసులను తప్పుదోవ పట్టించేలా ఫిర్యాదు 
* పోలీసుల చాకచక్యంతో అసలు విషయాలు వెలుగులోకి …
* తన ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అంగీకరిచలేదనే కొడుకే కడతేర్చిన వైనం
          డి.హీరేహాళ్ మండల కేంద్రంలో రెండున్నర నెలల కిందట జరిగిన జంట హత్యల కేసును రాయదుర్గం రూరల్ సర్కిల్  పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దర్ని అరెస్టు చేశారు. వీరిలో ఒకరు స్వయాన హతుల కుమారుడు ఉన్నాడు. కన్న కొడుకే కాలయముడై తల్లిదండ్రులను కడతేర్చినట్లు విచారణలో వెల్లడయ్యింది. తల్లిదండ్రులను హతమార్చి ఆ నేరాన్ని వేరొకరిపై నెట్టే ప్రయత్నం చేశాడు. పోలీసులు దర్యాప్తులో నాణ్యతా ప్రమాణాలు పాటించడం… చాకచక్యంగా వ్యవహరించడంతో కొడుకే అసలు నిందితుడని తేల్చారు. తన ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించలేదని ఆక్రోశంతో ఇద్దర్ని చంపాడు. సోమవారం జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
* నిందితుల వివరాలు:
1) గొల్ల హంచనహాళ్ అశోక్ @ అశోక్ , 24 సం., డి.హీరేహాళ్ మండల కేంద్రం.
2) కనికిరి జమ్మన్న @ జంబు, వయస్సు 29 సం., డి.హీరేహాళ్ మండల కేంద్రం 
** జంట హత్యల ఘటన వివరాలు:
             28-11-2019 రాత్రి డి.హీరేహాళ్ మండల కేంద్రంలో నివాసముంటున్న గొల్ల హంచనహాళ్ బసవరాజు, ఇతని భార్య లక్ష్మిదేవిలు దారుణ హత్యకు గురయ్యారు. ఆస్థి తగాదాలతో తన మేనమామ శంకర్ తన తల్లిదండ్రులను చంపి ఉండొచ్చని హతుల కొడుకు అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు డి.హీరేహాళ్ పోలీసులు కేసు నమోదు ( క్రైం నంబర్ 135/2019, 302 IPC 109, 201 R/W 34 IPC) చేశారు.
** నేపథ్యం: హతులు బసవరాజు, లక్ష్మిదేవిల కొడుకు అశోక్ కర్నాటకలోని హొళగుంది ప్రయివేట్ ఫ్యాక్టరీలో పని చేసేవాడు. ఇతను ఓ అమ్మాయిని ప్రేమించాడు. తల్లిదండ్రులకు అయిష్టమైన ఈ ప్రేమ వివాహం విషయంలో తరుచూ గొడవలు జరిగేవి. తల్లిదండ్రులతో అశోక్ గొడవపడే వాడు. ఇందులో భాగంగానే 28-11-2019 తేదీ రాత్రి గొడవ ప్రారంభమయ్యింది. కులాంతర వివాహం చేసుకోవద్దని తల్లిదండ్రులు మందలించారు. ఇదే విషయంలో తండ్రి కొడుకుపై చేయి చేసుకున్నాడు. తల్లిదండ్రులిద్దరూ  జీవించినంత కాలం తన ప్రేమ వివాహం సాధ్యం కాదని అశోక్ భావించాడు. అదే గ్రామానికి చెందిన జమ్మన్న కూడా అశోక్ కు మద్ధతు పలికి తల్లిదండ్రులను చంపేందుకు పురమాయించాడు. దీంతో  అశోక్ ఇనుప రాడ్ తీసుకుని తండ్రి తలపై బాదడం, అడ్డొచ్చిన తల్లిపై కూడా దాడి చేయడంతో అక్కడికక్కడే చనిపోయారు.  తనపై నేరం రాకూడదని ఘటనా స్థలంలో ఉన్న జమ్మన్నతో కలసి కుట్ర పన్ని తన మేనమామ అయిన శంకర్ పై నెట్టే పథకం రచించాడు. డాగ్ స్క్వాడ్ నిందితులను గుర్తించకుండా ఉండేలా శవాలపై మరియు ఆ పరిసరాలలో కారం పుడి చల్లారు. శంకర్ కు… బసవరాజు, లక్ష్మిదేవిల మధ్య ఆస్థి తగాదాలు ఉండటాన్ని ఫిర్యాదుకు వాడుకున్నాడు. ఆస్థి తగాదాలుతోనే తన తల్లిదండ్రులను మేనమామ శంకర్ చంపి ఉండొచ్చని అశోక్ ఫిర్యాదు చేయడం గమనార్హం.
** దర్యాప్తులో నాణ్యతా ప్రమాణాలు, చాకచక్యం…. వెలుగులోకి అసలు విషయం
    
       దంపతుల హత్య ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించి లోతుగా విచారణ చేపట్టారు. దర్యాప్తులో నాణ్యతా ప్రమాణాలు పాటించారు. చాకచక్యంగా వ్యవహరించారు. కళ్యాణదుర్గం డీఎస్పీ ఎం.వెంకటరమణ, రాయదుర్గం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజా, డి.హీరేహాళ్ , బొమ్మనహాళ్ ఎస్ ఐ లు వలీ బాషా, రమణారెడ్డి మరియు సిబ్బంది బృందంగా ఏర్పడి ఈరోజు అశోక్ , జమ్మన్నలను అరెస్టు చేశారు. తన ప్రేమ పెళ్లికి అంగీకరించలేదని… వారిని చంపేస్తే గానీ తన పెళ్లి కాదని భావించి కడతేర్చినట్లు మరియు ఘటనా స్థలంలో కారం పుడి చల్లడం… జంట హత్యల నేరాన్ని మేనమామపై నెట్టేసినట్లు అశోక్ పోలీసుల విచారణలో అంగీకరించారు. 
* ప్రశంస…. తల్లిదండ్రులను కన్న కొడుకే కడతేర్చి నేరం మరొకరిపై నెట్టే ప్రయత్నం చేసిన జంట హత్యల కేసును చాకచక్యంగా ఛేదించిన కళ్యాణదుర్గం డీఎస్పీ ఎం.వెంకటరమణ, రాయదుర్గం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజా, డి.హీరేహాళ్ ఎస్ ఐ వలీ బాషా మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు అభినందించారు.
** కొసమెరుపు… తల్లిదండ్రులను తానే చంపి ఆ నేరాన్ని మేనమామపై నెట్టేలా ఫిర్యాదు చేయడమే కాకుండా జిల్లా ఎస్పీని నాలుగు సార్లు కలసి జంట హత్యల కేసు ఛేదించమని మరియు తన మేనమామ శంకర్ తో ప్రాణహాని ఉందని అశోక్ విన్నవించాడు.

Leave a Reply

Your email address will not be published.