ప్లాట్ఫాం టిక్కెట్ ధర పెంపు

పండుగ సీజన్లో జనం జేబుల్ని లూటీ చేసేందుకు ఓ వైపు ప్రయివేటు బస్సులతో పాటు ఆర్టీసీ స్పెషల్స్ పేరుతో 50 శాతం అదనపు చార్జీలు వసూలుకు రంగం సిద్దం చేస్తుంటే… మరో వైపు ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు సౌకర్యాలు కలిగించాల్సిన రైల్వేలు ప్లాట్ఫాం టిక్కెట్ రేట్లు పెంచి బెంబేలెత్తిస్తోంది.
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్, కాచీగూడ రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ ధరలు రూ.10 నుంచి రూ.20కి పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల ముఖ్య అధికారి రాకేష్ మీడియాకు గురువారం తెలిపారు. పండుగ సందర్భంగా ప్రయాణికులతోపాటు ఎక్కువ మంది స్టేషన్కు వస్తుంటారని చెప్పారు. దీంతో రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంటోందని.. దాన్ని తగ్గించడంలో భాగంగానే టికెట్ ధర పెంచామని, ఇవి కేవలం పండుగ సీజన్ అంటే ఈనెల 9వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అమల్లో ఉంటాయని, తదుపరి సాధారణంగానే ఉంటాయని రాకేష్ తెలిపారు.