రాజధానిని కడపలోనో, పులివెందులలోనో పెట్టుకో

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాత్కాలికం, తాత్కాలికం అంటూ చంద్రబాబు పిచ్చి పని చేశారని విమర్శించారు. అమరావతిని అత్యున్నత స్థాయిలో నిర్మించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు అలా చెప్పారని వివరించారు. రాజధానిని ముక్కలు చేస్తే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. రాజధానిని కావాలంటే కడపలోనో, పులివెందులలోనో పెట్టుకోమని చెప్పారు. రాయలసీమ ప్రజలకు విశాఖ చాలా దూరమవుతుందన్నారు. చాలా ఇబ్బంది పడతారని తెలిపారు.
రాయలసీమకు హైకోర్టు రావడం వల్ల ఒరిగేది ఏమీ లేదన్నారు. మహా అయితే ఓ 10 జిరాక్స్ షాపులు వస్తాయని… అంతకు మించి రాయలసీమ ప్రాంతానికి ఎలాంటి ఉపయోగం లేదని చెప్పుకొచ్చారు. రాజధానిని మార్చడం వైసీపీ నేతలు చెబుతున్నంత సులభం కాదని పేర్కొన్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని అన్నారు. ఇప్పుడున్న భవనాలతో రూపాయి ఖర్చు లేకుండా పదేళ్లు నడిపించవచ్చని సూచించారు.