ప్రాజెక్ట్ నిర్మాణంపై వైసిపి చేసిన ప్రచారం అబద్ధం : కేంద్రం వివరణ

అసలు పునాదులే తీయలేదంటూ ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై వైసిపి చేసిన ప్రచారం అబద్దమని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా మరోసారి తేల్చేసింది. గురువారం పార్లమెంటు సమావేశాల్లో టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్ట్ కు నిధుల కొరత ఉందని, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును జాతీయప్రాజక్టుగా ప్రకటించినా, ఎప్పటిలోగా పూర్తి చేస్తారు..? అని ప్రశ్నించారు. ఈ విషయంపై కేంద్రమంత్రి షెకావత్ కేశినేని నానికి సభా ముఖంగా సమాధానమిస్తూ. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి పోలవరం నిర్మాణం 69.54శాతం పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసినట్టు వివరించారు. పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి విభజన చట్ట పరిధిలో ఇందుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరిస్తుందని స్పష్టం చేసారు. ఇప్పటి వరకు రూ.8, 614.16 కోట్లు ఏపీకి తిరిగి చెల్లించామని, ఈ ప్రాజక్టుకు సంబంధించి గత నెలలో రూ.1850 కోట్లు విడుదల చేసినట్టు వివరించారు. అయితే ఇప్పటివరకు చెల్లించిన మొత్తాలను ఎలా ఖర్చు చేసారో… అందుకు సంబంధించిన ఆడిట్ నివేదికలు తమకి అందిస్తే, మిగిలిన మొత్తాలను దశల వారీగా అందిస్తామని ఇప్పటికే 2018, 2019లలో రెండు లేఖలు ఏపీ ప్రభుత్వానికి పంపినా నేటికీ స్పందన కరువయ్యిందని వ్యాఖ్యానించారు మంత్రి షెకావత్ . అలాగే పోలవరం ప్రాజక్టును 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన సమాధానం ఇచ్చారు.
కాగా 2021 జూన్‌నాటికి ప్రాజెక్టును ప్రాజక్టు పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెపుతున్నా.. రివర్స్ టెండర్స్ పేరుతో జరిగిన కాలయాపన కారణంగానే డిసెంబర్ 2021కి పూర్తి కావటం కూడా గగనమేనని, శరవేగంగా పనులు జరపటం సాధ్యమేనా అనిపించక మానదు. నిజానికి ఈ ప్రాజక్టు వ్యయం 55 వేల కోట్ల కాగా అందులో అందిన మొత్తం రూ.8, 614.16 కోట్లు కావటం, ఇటీవలి కేంద్ర బడ్జెట్లో పోలవరానికి నిధులు కేటాయించక పోవటం, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిధులు అంతంత మాత్రంగానే కేటాయించుకోవటం వెరసి పనుల వేగవంతం ఎలా? అన్నది ప్రశ్నార్ధకమే.