గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్‌రాజా…

మాస్‌రాజా రవితేజ రాజా దిగ్రేట్ సినిమా తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ ప్లాపులుగా మిగిలిపోతున్నాయి. గత కొంతకాలంగా రవితేజ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోవడం లేదు. ఒకప్పుడు ప్రయోగాలకు సిద్ధపడే ఈ హీరో ఇప్పుడు అటువైపు చూడడం లేదు. దీనికితోడు అతని సినిమాలన్నీ రోటీన్‌గా ఉంటున్నాయి. శుక్రవారం విడుదలైన  ‘డిస్కో రాజా’ కూడా అభిమానులకు రుచించడం లేదు. అయితే ఈసినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా చేస్తోన్న రవితేజ, మరో సినిమాకూ రెడీ అయ్యాడు.  ఇదివరకు తనతో ‘వీర’ సినిమాని తీసిన రమేశ్‌వర్మ డైరెక్షన్‌లో మరో మూవీని చేయబోతున్నాడు. రమేశ్‌వర్మతో ఇటీవల ‘రాక్షసుడు’ వంటి హిట్ థ్రిల్లర్‌ను తీసిన ఏ స్టూడియోస్ అధినేత కోనేరు సత్యనారాయణ ఈసినిమాను నిర్మించనున్నారు.

జనవరి 26 రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టును ప్రకటించారు.  బర్త్ డే కానుకగా ఈసినిమా ప్రకటించడంతో రవితేజ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అంతేగాకుండా తన అభిమానులు ఇష్టపడేలా అన్ని హంగులతో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని రూపొందించనున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించి, మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతామని నిర్మాత తెలిపారు. ఈ మూవీలో నటించే హీరోయిన్, ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను  యూనిట్ త్వరలో ప్రకటించనున్నారు. ‘వీర’ సినిమా విజయం సాధించక పోయినా, రమేశ్‌వర్మ చెప్పిన సబ్జెక్ట్ బాగా నచ్చి, మళ్లీ అతని డైరెక్షన్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు రవితేజ.

Leave a Reply

Your email address will not be published.