అందరి కష్టాలు తీర్చే దేవుడికే కష్టం వస్తే…

ఎవరైనా కష్టం వస్తే దేవుడికి చెప్పుకుంటారు… కష్టాల నుండి తమను గట్టెక్కించమని క‌నిపించినా… క‌నిపించ‌కున్నా… కోటి దేవుళ్ల‌ని వేడుకుంటారు…   త‌మ క‌ష్టాలు తీరుస్తాడ‌ని న‌మ్మే ఆ దేవుడికే కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి… పైనున్న దేవుడు నేల పైకి రాలేడు క‌నుక కింద‌నున్న ప్ర‌భువులు త‌మ ఇష్టారాజ్యంగా ఆల‌యాల‌ను, అందులోని దేవుళ్ల‌ని అంత‌కు మించి  పూర్వ కాలంలో ఎవరెవరో దాతలు ఇచ్చిన భూములను త‌మ ఇష్టాను సారంగా వాడేసుకుంటున్నారు.  ఇందుకు ఏ పార్టీ అయినా తాము చెప్పిందే వేదం అన్న తీరుగా ఆరంభించిన దందాలు చివ‌ర‌కి …  దేవాలయాలలో నిత్య దూప, దీప, నైవేద్యాలు సక్రమంగా జరగక పోవ‌టానికి కార‌ణ‌మ‌య్యాయి.
భూముల నుండి ఆదాయం బాగా వస్తున్నా.. కౌలు దారులు.. చెల్లించాల్సి సొమ్మును ఆల‌యాల‌కు చెల్లించటం లేదు. అధికారంలో ఎవరు ఉన్నా కౌలు దారులు వారి సిఫార్సులతో చెల్లించకుండా ఇబ్బంది పెడుతుండ‌టం స‌ర్వ సాధార‌ణ‌మై పోయింది.  దీనికి తోడు వేలాది ఎకరాల దేవాదాయ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. కబ్జా దారుల కోరల్లో చిక్కుకు పోయాయి.  రెవెన్యూ రికార్డుల్లో దేవుడి పేరుతో రికార్డులు ఎక్కించాలని, రికార్డులను సరి చేయాలని, పహాణీ, సర్వే రికార్డుల్లో ఆయా భూముల వివరాలను చేర్చి పకడ్భందీగా రికార్డుల నమోదు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. రెవెన్యూ రికార్డుల్లో ఎండోమెంట్ భూములకు చెందిన వివరాలను యాజమాన్య హక్కు కాలమ్‌లో దేవుడి పేరుతో పాటు సదరు ఆలయం పేరును రాయాలని రెవెన్యూ శాఖ భావిస్తుండ‌గా ఇప్ప‌టికే ఈ భూముల‌పై క‌న్నేసిన కొంద‌రు దేవుడి పేరున కొంత మొత్తం చెల్లించి ఆ భూముల‌ను త‌మ స్వాధీనంలోకి తీసుకోవాల‌ని  చూస్తున్న‌ట్టు స‌మాచారం. 
చాలా భూముల యాజమాన్య హక్కులు మాత్రం రెవెన్యూ రికార్డుల్లో దేవాదాయ శాఖ పేరు మీద లేక పోవ‌టం వీరికి క‌ల‌సి వ‌స్తోంది.  పహాణీలో ఇతరుల పేర్లు వస్తుండడంతో ఈ భూముల‌పై న్యాయపరమైన వివాదాలు జోరందుకున్నాయి. ఈ మాన్యాలను కౌ లుకు తీసుకున్న వాళ్లు యథేచ్చగా ఆక్రమణలకు పా ల్పడుతు పంటలు పండించుకుంటున్నా కనీసం కౌలు సొమ్మును కూడా చెల్లించకపోవటంతో దేవాలయాల నిర్వహణ కష్టంగా మారింది.  
ఇక దేవాదాయ శాఖ ప‌రిధిలో నిర్వ‌హిస్తున్న ప‌లు సత్రాల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒక్కొక్క దేవాలయానికి, స‌త్రానికి భారీగా ఆదాయం వచ్చే వ్యవసాయ భూములు న్నాయి. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్క పంట, మ‌రి కొన్ని ప్రదేశాలలో రెండు నుండి మూడు పంటలు కూడా పండుతున్నాయి. అయినప్ప‌టికీ కొన్ని చోట్ల నేటికీ కౌలు కేవలం ఒక్కరూపాయే చెల్లిస్తుండ‌టం ఆశ్చ‌ర్య‌క‌రం. మరి కొన్ని చోట్ల ఎక‌రాకు ఒక్క బస్తా ధాన్యం మాత్రమే కౌలు చెల్లిస్తున్నారని దేవాదాయ శాఖ వ‌ర్గాలే చెపుతున్న మాట‌.  కాగా ప్ర‌భుత్వం మారాక చాలా మంది కౌలు దారులు శిస్తులు చెల్లించటం లేదని, దీంతో దేవాలయాలలో దూప, దీప, నైవేద్యాలకు నిధులు కరువయ్యాయని వాపోతున్నారు.  తమకు తెలిసిన దాతలను బతిమాలి పూజారులు ఏదో విధంగా నిదులను సమకూర్చుకుంటూ దూప, దీప నైవేద్యాలకు అంతరాయం కలుగకుండా తమ వంతు కృషి చేస్తున్నార‌న్న‌ది మాత్రం చేదు నిజం.
గతంలో దేవాదాయ శాఖకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన దండు శివరామరాజు దేవాదాయ భూముల కౌలు విషయంలో అనేక మార్పులు చేర్పులు తెచ్చారు. అనేక దేవాలయ భూములలో అమలు అవుతున్న కౌలు విధానాన్ని రద్దు చేసి, దేవాదాయ భూములను ఆక్షన్‌ విధానం ద్వారా కౌలు విధానాన్ని ప్రవేశ పెట్టించారు. ఆ విధంగా ఎన్నో వేల దేవాలయాల పరిస్థితి మెరుగు పడగా.. ఇప్పటికీ కొన్ని జిల్లాలో ఆక్షన్‌ విధానాన్ని అమలు చేయకపోవటంతో ఆ భూములలో పంటలు పండించుకుంటున్న రైతులు కౌలు చెల్లించటం లేదు. 
చాలా భూములకు సంబంధించిన వివాదాలు కోర్టుల్లో తేలడం లేదు. రె వెన్యూ రికార్డులు లేకపోవడం దేవాదాయ శాఖ వద్ద ధ్రు వీకరణ పత్రాలు కనిపించకపోవడంతో ఆక్రమణదారులకు వరంగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు.శిస్తు చెల్లించమని కౌలు దారులను ఇబ్బంది పెట్టవద్దంటారు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు.  న‌వ‌శ‌కం ప‌థ‌కం ద్వారా అర్చ‌కుల జీతాలు, ఆల‌యాల‌లో దూప‌దీప నైవేద్యాలకు ప్ర‌బుత్వం ఢోకాలేకుండా చూస్తామ‌ని అధికార పెద్ద‌లు చెపుతున్నా.అమ‌లు అంతంత మాత్రంగానే ఉంది. చ‌ర్చి ఫాద‌ర్ల‌కి, ఇనాంల‌పై ఉన్న శ్ర‌ద్ధ ఆల‌యాల‌పై లేక‌పోవ‌టంతో ఈ ప‌థ‌కం నీరుగారుతోంద‌న్న ఆరోప‌ణ‌లు చాలా ఉన్నాయి. 
రాష్ట్రంలో ని దేవాదాయ భూములకు ఆక్షన్‌ విధానం అమలు చేస్తేనే దేవాల‌యాలు, దేవుళ్లు బ‌తికి బ‌ట్ట‌క‌డ‌తాయ‌ని త‌క్ష‌ణం దేవాలయాల్లో ఈ విధానం అమలు చేయాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.