కేటుగాళ్లు.. ‘అమిత్ షా’ పేరును ఎలా వాడుకున్నారో తెలిస్తే..
కేటుగాళ్లు.. మంత్రినే బురిడీ కొట్టించాలనుకున్నారు. భారీ మొత్తంలోనే స్కెచ్ గీశారు. అంతే ప్లాన్ అమలు చేయడానికి రంగంలోకి దిగారు. ఎల్లకాలం అన్ని సాపీగా సాగుతాయని అనుకున్నారో ఏమో తెలియదు గానీ. పాపం పండి అడ్డంగా దొరికిపారు.
అమిత్ షా పేరుతో ఫోన్ చేసి..
కేంద్రమంత్రి అమిత్ షా ఇంటి నుంచి తాము మాట్లాడుతున్నామని, మూడు కోట్ల రూపాయలు విరాళం ఇవ్వాలంటూ సాక్షాత్తూ హర్యాణా మంత్రి రంజిత్‌సింగ్ చౌతాలకు ఇద్దరు వ్యక్తులు ఫోన్ చేసి డిమాండ్ చేశారు. ఈ నెల 20న మంత్రికి ఓ వ్యక్తి పదేపదే ఫోన్ చేశాడు. అమాత్యులకు అనుమానం వచ్చి వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక అధికారిని సంప్రదించారు. విరాళం కోసం తాము ఎవరికీ ఫోన్ చేయలేదని అటు నుంచి సమాధానం వచ్చింది.
దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు, హర్యాణా భవన్‌కు వచ్చి డబ్బులు తీసుకెళ్లాలంటూ నిందితుడికి సూచించారు. నమ్మి వచ్చిన నిందితుడు, అతడికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు హర్యాణాకే చెందిన తోలు జాకెట్ల వ్యాపారి జగ్తార్ సింగ్‌గా, అతడికి సహకరించిన వ్యక్తిని ఉపకార్సింగ్గా పోలీసులు గుర్తించారు. పాపం పండి కటకటాల్లో ఊసలు లెక్కిస్తున్నారు.