కల్పవృక్ష వాహనంపై కనువిందు చేసిన శ్రీ కపిలేశ్వరస్వామి

శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన గురువారం ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారు కల్పవ క్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయకనగర్ ఎల్ టైప్ క్వార్టర్స్, హరేరామ హరేకృష్ణ ఆలయం, ఎన్జిఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్క భజనలు ఆకట్టుకున్నాయి.
అనంతరం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. సాయంత్రం 7 నుండి రాత్రి 9 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.