రాజధాని మార్పు పై బీజేపీ వ్యూహం ఇదేనా..?

ఏపి రాజధాని అమరావతే… దానిని ఎవ్వరూ కదిలించలేరంటూ రైతులకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి హామీ ఇవ్వడం వెనుక అమిత్ షా ఉన్నట్టు ఇప్పుడు సామాజిక మీడియాలో కథనాలు వెల్లువలా వస్తున్నారు. ఇప్పటికే రాజధాని తరలింపు వ్యవహారం శరవేగం చేస్తున్న ప్రభుత్వం రాగల పరిణామాలను ఎలా ఎదుర్కొనాలని యోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే కిషన్ రెడ్డి అమరావతిపై స్పష్టమైన హామీ ఇవ్వడం వెనుక కేంద్ర హోం శాఖ మంత్రి, బిజెపి జాతీయ నాయకుడు అమిత్ షా మంత్రాంగం ఉందంటూ ఢిల్లీలో జరిగిన పరిణామాలను ఎప్పటికప్పుడు అందించే వర్గమొకటి ఇచ్చిన సమాచారంతో వైసిపి నాయకులకు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టుగా మారిందన్నది కొందరు చెపుతున్న మాట.
నిజానికి ఆంధ్రప్రదేశ్ కు కనీస రాజధానిని గుర్తించకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే ఆఫ్ ఇండియా అధికారికంగా ఓ మ్యాప్ విడుదల చేసింది. ఆ సమయంలో టిడిపి పార్లమెంటు సభ్యులు మాత్రమే సభలో గళం వినిపించారు. 22 మంది సభ్యులున్న వైసిపి మాత్రం కనీసం ఈ విషయంలో నోరు మెదక పోవటంతో అప్పుడే అందరిలో ఆ పార్టీ వ్యవహార శైలిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. తదనంతర పరిణామాలలో కిషన్ రెడ్డి జోక్యం చేసుకుని జాతీయ మ్యాప్ లో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించేలా చేసి, కొత్త మ్యాప్ విడుదల చేయటంలో కీలక భూమిక పోషించారని చెప్పక తప్పదు.
అమరావతిని గుర్తిస్తూ దేశ మ్యాప్ లో మార్పులు చేసిన నాటి నుంచే వైసిపి ప్రభుత్వం డిఫెన్సులో పడిపోయింది. అడుగుతునే ఉంటామంటూ… ఢిల్లీలో తొలి సమావేశంలోనే సిఎం తేల్చి చెప్పేయటంతో ఆ అంశం కాస్త పడకేసిందని అంతా భావించినా, అడపా దడపా కేంద్రానికి రాసుకొచ్చే లేఖలలో ప్రస్తావిస్తూ… తామే ఆ అంశం సజీవంగా ఉంచుతామని చెప్పుకునేలా చేసారు. ఈ క్రమంలోనే ప్రత్యేక హోదా అంశాన్ని పదేపదే ప్రస్తావనలకు వస్తుండటంతో పాటు 22 మంది సభ్యులు ఏం చేస్తున్నారంటూ ఇటీవల పార్టీ అంతర్గత సమావేశంలో ఓ చర్చ జరిగిందని తెలుస్తోంది. దీంతో ఈ అంశాన్ని మరింత లోతుకు పాతేయాలంటే ఏం చేయాలన్న అంశానికి అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ కలసి రావటం… తను అనుకున్న విధంగానే రెండు కమిటీలతో నివేదికలు తెప్పించుకోవటం… దానిపై మరో హైపర్ కమిటీని వేసి అనుకూలంగా సమీక్షించుకోవటం చకచకా మారుతున్న పరిణామాల నేపథ్యంలో రాజధాని తరలింపు ఆసక్తి కరంగా మారింది.
ఇప్పటికిప్పుడు రాజధాని కోసం ప్రత్యేకంగా భవనాలు నిర్మించలేరు కనుక విశాఖలో ఐటి సెక్టార్కోసం నిర్మించిన మిలీనియం టవర్స్‌ని సెక్రటేరియట్‌గా మార్చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే అందులో ఉన్న సంస్ధలను బైటకు వెళ్లగొట్టే ప్రక్రియ భద్రత మాటున జరుగుతున్నట్టు కనిపిస్తోందని చెపుతున్నారు స్థానికులు. రాజధాని వస్తే ఉపాధి దొరుకుతుందని ఆశగా ఉన్న వారికి ఉన్న ఉద్యోగాలు పోయేలా ఉందని ఆందోళన వ్యక్తమవుతుంటే…. అమరావతిలో శాసనసభ్యుల కోసం, అధికారుల కోసం నిర్మించిన భవనాలను ఐటి సెక్టారుకు అందిస్తామన్న లీకులు వదులుతున్నారు కొందరు వైసిపి పెద్దలు. దీంతో మిలీనియం టవర్‌ని ఖాళీ చేయించడం ఖాయంగా కనిపిస్తోంది.
అయితే భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మూడు రాజధానులపై తన వైఖరి స్పష్టం చేయడంతో నేను చెప్పిందే బిజెపి మాట అంటూ ఎందరెన్ని మాట్లాడినా పరిస్థితి నిశితంగా గమనించి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో మూడు రాజధానులకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించాలని నిర్నయించినట్టు తెలియటంతో ఊహించని ఈ పరిణామాల వెనుక ఏం జరిగిందని, ఢిల్లీలో వైసిపి నాయకులు ఆరా తీస్తున్నారు. రాజధానుల అంశంలో బిజెపి జాతీయ కమిటీ ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చిన తరువాతే కిషన్ రెడ్డితో హామీ ఇప్పించిందని తెలుసుకున్న వైసిపి నాయకుల పరిస్థితిని జగన్‌కి చేరవేసినట్టు సమాచారం.
ఆ మధ్య జగన్ రాజధాని ప్రకటన తదుపరి విశాఖ వచ్చినప్పుడు తనదైన ట్రేడ్ మార్కు చూపించుకునేందుకు వైసిపి విజయసాయి రెడ్డి చూపిన అత్యుత్సాహంపై ఏలాంటి ప్రకటన చేయకుండా సిఎం వెనుదిరగటంతో గాలి తీసేసినట్టయ్యింది. గోదావరి జిల్లాలలో ఈ అంశం ప్రస్తావించినా… మంగళవారం తనకే నిరసనల సెగ తగలటంపై ఆగ్రహంతో ఉన్న జగన్, రాజధాని మార్పు అని కాకుండా కొన్ని ప్రధాన కార్యాలయాలు ఖచ్చితంగా చేయాలని ఆదేశాలివ్వటం గమనార్హం. దీంతో సంబంధిత శాఖల తరలింపు 10వ తేదీలోగా పూర్తి చేసేందుకు అధికారులు రడీ అవుతున్నారు. అయితే పనిచేసే ఉద్యోగులు తరలింపుపై తన నిరసన లేపటం ఈ సందర్భంగా కొసమెరుపని చెప్పాలి. మరి రానున్న రోజులలో ఏం జరగనుందో చూడాలి.