ఫిబ్రవరిలో విడుదల కానున్న`నిశ్శబ్దం`

తెలుగు చిత్ర పరిశ్రమలో గ్లామర్ క్వీన్ అనుష్క తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకుంది. ఆమె అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. `అరుంధతి`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `భాగమతి` వంటి సూపర్‌హిట్ చిత్రాలతో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు అనుష్క చిరునామాగా నిలిచింది.
ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం `నిశ్శబ్దం`. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్‌పై టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందుతోన్న ఈ క్రాస్ ఓవర్ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాను జనవరి 31న విడుదల చేయాలనుకున్నారు. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు కొన్ని సాంకేతిక కారణాలతో సినిమా వాయిదా పడే అవకాశం ఉందని, ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయని టాక్ వినపడుతుంది. మరి సినిమా విడుదలపై చిత్ర యూనిట్‌పై ఇంతవరకు స్పందించలేదు.