బౌండ్ స్క్రిప్టు చూశాకే ఓకే అన్నాడ‌ట‌!

గ‌తంతో పోలిస్తే సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌ సినిమాల ఎంపిక విష‌యంలో దూకుడు పెంచారు. ఒక సినిమా త‌రువాత కొంత విరామం తీసుకుని మ‌రో చిత్రానికి స‌మ‌యం కేటాయించే మ‌హేష్ త‌న పంథాను మార్చుకున్నారు. ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తిని చూపిస్తున్నారు. కొర‌టాల శివ రూపొందించిన `భ‌ర‌త్ అనే నేను` త‌రువాత ఎక్కువ బ్రేక్ తీసుకోని మ‌హేష్ వెంట‌నే వంశీ పైడిప‌ల్లి చిత్రాన్ని ప‌ట్టాలెక్కించిన విష‌యం తెలిసిందే. `మ‌హార్షి` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అశ్వ‌నీద‌త్‌, దిల్ రాజు, ప్ర‌సాద్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం పోల్లాచ్చీలో జ‌రుగుతోంది. ఈ సినిమా త‌రువాత వ‌రుస‌గా చిత్రాలు చేయాల‌ని డిసైడ్ అయిన మ‌హేష్ యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ల‌కు క‌థ‌లు వినే వెసులుబాటు క‌ల్పించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌ను ఎంపిక చేసుకున్న యంగ్ డైరెక్ట‌ర్‌లు చెప్పిన క‌థలు విన్న మ‌హేష్ ఏ ద‌ర్శ‌కుడికీ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌న‌ట్లు తెలుస్తోంది. అనుభ‌వం, బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ లు ఇచ్చిన ట్రాక్ రికార్డ్ వున్న సుకుమార్ నే స్క్రిప్ట్ విష‌యంలో ముప్పుతిప్ప‌లు పెడుతున్న ప్రిన్స్ ఎంత టాలెండెడ్ డైరెక్ట‌ర్ అయినా బౌండ్ స్క్రిప్ట్ ఉంటేనే ఛాన్స్ అంటూ శ‌ర‌తులు విధిస్తున్నాడ‌ట‌. బౌండ్ స్క్రిప్ట్ లేక‌పోతే త‌న ద‌గ్గ‌ర మీ ప‌ప్పులు ఉడ‌క‌వ‌ని ఖ‌చ్చితంగా చెబుతున్నాడ‌ట‌.

సుకుమార్ ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని క‌థలు చెప్పినా ఓకే చెప్ప‌ని మ‌హేష్ బౌండ్ స్క్రిప్ట్ తో వ‌చ్చిన త‌రువాతే ఓకే చెప్పిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌హేష్ తో  సుకుమార్ ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సాగే కొత్త క‌థ‌తో సినిమా చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్ర క‌థ‌ని ఒక‌ లైన్ గా చెప్పినా ఒప్పుకోని మ‌హేష్ ఇటీవ‌ల బౌండ్ స్క్రిప్ట్ తో వ‌చ్చి సుకుమార్ వినిపించ‌డంతో ఓకే చెప్పేశాడ‌ని తెలిసింది.

Leave a Reply

Your email address will not be published.