బన్ని లాంటి కుర్రాడిని పెళ్లాడాలనుకున్నా!

‘లవర్స్ డే’ సినిమా చూసిన వారికి నూరిన్ షరీఫ్ గురించి పరిచయం అవసరం లేదు. ఉంగరాల జుట్టుతో సరదా సరదాగా ఉంటూ, పతాకసన్నివేశాల్లో ఉన్నట్టుండి అందరినీ భావోద్వేగానికి గురి చేసిన అమ్మాయి. సుఖీభవా సినిమాస్ పతాకంపై గురురాజ్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. సి.హెచ్.వినోద్ రెడ్డి దర్శకుడు. ఒమర్  నిర్మాత. ఈ సినిమా గురించి నూరిన్ హైదరాబాద్‌లో బుధవారం మాట్లాడారు. ఆ విశేషాలు

‘లవర్స్ డే’లో మీ పాత్ర గురించి….
-నేను చేసిన గాధ పాత్రని ప్రేక్షకులు ఇంతగా ఇష్టపడతారని అనుకోలేదు. చాలా మంచి స్పందన వస్తోంది. తమ స్కూల్ ఫ్రెండ్స్ లో ఒకరిని కలిసిన భావనే కలుగుతోందని చాలా మంది చెప్పారు.

వింక్ సెన్సేషన్స్ తర్వాత కథలో మార్పుల గురించి?
-ఇందులో మొదటి నుంచీ లీడ్ రోల్ అనే చెప్పారు. మీరన్నట్టు కథని కాస్త చేంజ్ చేశారు. నా పాత్ర కంటే ప్రియా వారియర్ పాత్ర ప్రాధాన్యతను పెంచారు.

మీ పాత్రకు ఎలాంటి స్పందన లభించింది?
నా పాత్రకు చాలా మంచి స్పందన వస్తోంది. చూసినవారందరూ బావుందని మెచ్చుకున్నారు.

కథలో మార్పులు?
-కన్ను కొట్టడం, గన్ను పేల్చడం, మాణిక్య మలరాయ్ పాట విడుదల కావడం.. వాటన్నిటికీ చాలా మంచి స్పందన రావడం వల్ల కథలో మార్పులు చేశారు.

మీ పాత్ర పరిధి తగ్గాక.. అప్‌సెట్ అయ్యారని వార్తలు వచ్చాయి!
అప్‌సెట్ కాదు.. ఎమోషన్ అయ్యాను. అయితే అది పట్టించుకోవాల్సిన విషయం కాదు. అయినా మనందరం మనుషులం. కోపతాపాలు కచ్చితంగా ఉంటాయి. సినిమా కోసం చేసిన మార్పు కొంత ఫీలయ్యేలా చేసింది. ఈ సన్నివేశంలో ఎవరైనా అంతే.

ప్రియా వారియర్‌తో గొడవపడ్డారా?
-ప్రియాను నేను తొలిసారి సెట్స్ మీదే కలిశాను. మా మధ్య కొన్ని సీన్లు కూడా ఉన్నాయి. మా మధ్య గొడవలు ఏమీ లేవు.

మలయాళంలో  స్పందన?
-మలయాళంలో మొదట మిశ్రమ స్పందన వచ్చింది. పెద్దవారికి, యువతకు నచ్చింది. అయితే క్లైమాక్స్ మార్చాక ఇంకా చాలా మందికి నచ్చింది. నాకు రెండు వెర్షన్లు నచ్చాయి. థియేటర్ లో సినిమా చూస్తున్నంత సేపు మేం పడ్డ కష్టం, షూటింగ్ చేసిన రోజులు గుర్తుకొచ్చాయి.

ఆడియో వేడుకకు బన్నీ రావడం?
‘బన్నీ’, ‘హ్యాపీ’ వంటి సినిమాలను టీవీలో చూస్తూ పెరిగాను. బన్ని లాంటి కుర్రాడిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అలాంటిది నేను నటించిన సినిమా డబ్బింగ్ వెర్షన్ ఆడియో వేడుకకు ఆయన రావడం, వేడుక ఆఖరున ఆయన నా చేతిని పట్టుకోవడం జీవితంలో మర్చిపోలేను. ఆ క్షణంలో ఎవరో ఫొటోలు కూడా తీశారు. ఆ ఫొటో తీసిన వ్యక్తి కోసం ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నా. నాకు ఆ ఫొటో కావాలి.

సెట్స్ మీద సరదా సరదాగా కనిపించారు!
-నేను ఎవరితోనూ అంత తేలిగ్గా కలవను. ఒక వేళ కలిస్తే దయచేసి కాసేపు ఊరుకుంటావా అని అవతలివాళ్లు అడిగేలాగా ప్రవర్తిస్తా. దగ్గరివారి దగ్గర మాత్రమే సరదాగా మాట్లాడగలను.

తదుపరి సినిమాలు?
-ప్రస్తుతం మలయాళంలో ఇదే దర్శకుడితో ఓ సినిమా ఉంది. తెలుగులో కొన్ని కథలు వింటున్నా.

నిర్మాత గురించి…
-సొంత కుటుంబంలా నన్ను బాగా చూసుకుంటున్నారు. చాలా మంచి నిర్మాత.

Leave a Reply

Your email address will not be published.