నెల్లూరు లో విజృంభిస్తున్న కరోనా

శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ ఏపిని భారీగానే తాకినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా నెల్లూరులోనే ఒక్క గురువారం 14 అనుమానిత కేసులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారని సమాచారం. ఈ విషయమై సమీక్షించిన జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసారు. ఇప్పటికే ఓ కరోనా బాధితుడు జిల్లా కేంద్ర ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో జిల్లాలో మరో మూడు ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన తొలి కేసు నెల్లూరిదే కావటంతో ఆసుపత్రిలో చేరిన ఆ యువకుడు తిరిగిన ప్రాంతాలు, కలుసుకున్న వ్యక్తులను ఆరాలు తీసిన ఆరోగ్య శాఖ అధికారులు వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో మొత్తం 14 మందిని అనుమానితులుగా గుర్తించి, వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని వైద్య విభాగం చెపుతోంది.
కాగా ఈ వైరస్ మరింత మందికి వ్యాపించే ఆస్కారం ఉందని, ముందస్తు చర్యలలో భాగంగా జిల్లా కేంద్రంతో పాటు పలు రద్దీ పట్టణాలలో అన్ని థియేటర్లను మూసివేయాలని థియేటర్ల యజమానులతో చర్చల సందర్భంగా ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఆయన తెలిపారు . అన్ని షాపింగ్ మాల్స్‌లో ప్రజలు మాస్క్‌లను ధరించేలా చూడాలని, ఈ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశంలో సూచించారు.