షర్మిల రుణం తీర్చుకొనే అవకాశం… రాజ్యసభ టికెట్స్ దాదాపు ఖరారైనట్లే

ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలు ఏక పక్షంగా గెలిచే అవకాశాలున్న నేపథ్యంలో వైసిపి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దాదాపుగా అభ్యర్దుల ఎంపిక పూర్తి చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరిలో తను జైలులో ఉన్నప్పుడు పార్టీలో ఉత్సాహపూరిత వాతావరణం తీసుకువచ్చి, పట్టుజారకుండా పార్టీకి విశిష్టమైన సేవలు అందించిన షర్మిలను రాజ్యసభకు పంపడం ద్వారా రుణం తీర్చుకోనున్నారని సమాచారం.
అలాగే మండలి రద్దుతో పదవిని కోల్పోతున్న పిల్లి సుభాష్ చంద్రబోస్‌ని ఎంపిక చేయాలనుకున్నా, ఆ స్థానంలోకి ముఖ్యమంత్రి కి సన్నిహితుడు, రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకట రమణ కు రాజ్యసభ టిక్కెట్ దాదాపుగా ఖరారైనట్టు సమాచారం అందుతోంది. దీనికి ప్రధాన కారణం గత కొంత కాలంగా లోక్ సభ ఎంపిలలో కొందరు కమలం పార్టీతో అత్యంత సన్నిహితంగా ఉండటం, తాము ఏనాడైనా బిజెపిలో చేరిపోతామన్న లీకులు మీడియాకు ఇస్తుండటంతో తలనొప్పిగా మారింది. పైగా వారి వ్యవహారశైలిపై జగన్ కు ఉన్న అనుమానం తీర్చేలా వారి పై సాయిరెడ్డితో పాటు నిఘావేసేందుకు మోపిదేవి సరైన వ్యక్తి అనిభావించి ఆతన్ని రాజ్యసభకు పంపాలని జగన్ యోచిస్తున్నారని సన్నిహిత వర్గాల భోగట్టా.రాజ్యసభ టికెట్స్ దాదాపు ఖరారైనట్లేనా
క్షత్రియ సామాజిక వర్గంలో పలుకుబడి కలిగిన మాజీ ఎంపీ, అమిత్ షా సన్నిహితుడైన గోకరాజు గంగరాజు కుమారుడు, సోదరులను వైసిపిలో చేర్చుకుని బిజెపికి షాక్ ఇచ్చిన జగన్ చేరిక సందర్భంగా ఇచ్చిన మాట మేరకు గోకరాజు గంగరాజు కు రాజ్యసభ ఇచ్చే ఆస్కారం ఉందని సమాచారం. అయితే కృష్ణా నదీ తీరంలో చంద్రబాబు నివాసంపై దాడులు చేసినా, పక్కనే ఉన్న గోకరాజు గెస్ట్ హౌజ్ వైపు చూడక నోటీసులిచ్చేందుకే పరిమితం కావటం విమర్శలకు తావిచ్చాయి. అయితే తాజా పరిణామలతో గోకరాజు కుటుంబాన్ని వైసిపిలోకి రప్పించేందుకే ఈ తతంగం నడిపారన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం సినీ నటులకు ఇప్పటికే పదవులు ఇచ్చేసినా, ఫిల్మ్ ఇండస్ట్రీ తమకే మద్దతు ఇస్తున్నందున తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి ఒకరికి రాజ్యసభ అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవిని పార్టీలో చేర్చుకుని రాజ్యసభకు పంపాలని తొలుత భావించినా, గతంలో కాంగ్రెస్ తరపున రాజ్యసభకు వెళ్లిన చిరంజీవి వ్యవహారంపై ఆరాలు తీసి మనసు మార్చుకున్నారు. తాజాగా విజయవాడలో కేశినేని నానిపై పోటీకి దిగి ఓడిపోయిన పివిఆర్ గ్రూప్ ధియేటర్ల అధినేత పొట్లూరి వరప్రసాద్ (పి వి పి) ని సినీ పరిశ్రమ కోటాలో ఎంపిక అయ్యే అవకాశం ఉంది. చివరి నిమిషంలో పార్టీలో వత్తిడి, ఇతరత్రా అవసరాలు వస్తే తప్ప ఈ నాలుగు పేర్లూ దాదాపుగా ఖరారైనట్లేనని పార్టీ వర్గాలు చెపుతున్న మాట.