అప్పుల ఊబి లో ఏపీ —కన్నాలక్ష్మీనారాయణ

 చంద్ర బాబుకు  ప్రజలు అధికారం అప్పగిస్తే ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తాడని,.రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు దోచుకున్నది చాలక మరో ఐదేళ్లు దోచుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అడ్డదారులన్నీ తొక్కుతున్నారని, ఆయన్ను ప్రజలు తిరస్కరించుకుంటే ఆంధ్ర ప్రదేశ్ అప్పుల ఊబి లో కూరుకు పోతుంది ఆంధ్రప్రదేశ్‌ను ఆ దేవుడు కూడా కాపాడలేడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ అన్నారు . తిరుపతిలోని బీజేపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో బాబు ప్రజలకు తాయిలాలు ప్రకటించేస్తున్నారని ఆరోపించారు. ఎలాగైనా గెలవాలన్న ఆశతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించేస్తున్నారని మండిపడ్డారు. ఎఫ్‌ఆర్‌బిఎం రూల్స్‌ను కూడా తుంగలో తొక్కుతున్నారన్నారు. మొబలైజేషన్ నిధులు కేటాయిస్తు అందులో కమిషన్లు కొట్టేస్తున్నారన్నారు. చివరికి మహిళలకు సెల్ ఫోన్‌లు ఇస్తామని రూ.2500 విలువచేసే ఫోన్‌కు రూ.11వేలు బిల్లు వేసి, రూ.7500 కమిషన్ కింద నొక్కేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇందులో రూ.5వేలను ఓట్లు కొనుక్కునేందుకు ఖర్చుపెట్టనున్నారని లక్ష్మీనారాయణ ఆరోపించారు. అప్పులుపైన అప్పులు తెచ్చి ఏం చేస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో పెట్టినవి, పెట్టనవాటికి కూడా గ్యారెంటీలు ఇస్తూ రూ. 93వేల కోట్లు వివిధ సంస్థలకు కేటాయిస్తున్నట్లు చెప్పడం అత్యంత దారుణమన్నారు. ఇందులో ట్రాన్స్‌కోకు 9,700 కోట్లు, సిఆర్‌డికి 14,060 కోట్లు, మున్సిపాలిటీలకు రూ. 13వేల కోట్లు, జనవనరులకు రూ.14వేల కోట్లు, పౌరసరఫరాలకు రూ. 13,500 కోట్లు, మచిలీపట్నం పోర్టుకు రూ., 1,060 కోట్లు, గ్రామీణ మంచినీటి పథకానికి రూ. 5,300 కోట్లు, ఏపీ రహదారుల శాఖకు రూ. 10వేల కోట్లు, ఫైబర్ నెట్‌కు రూ. 4వేల కోట్లు, రైతు సాధికారకతకు రూ. 4వేల కోట్లు ఇలా గ్యారెంటీలు ఇస్తూ ఎఫ్‌ఆర్‌బిఎస్ నింబంధనలు కూడా బాబు అతిక్రమించేస్తున్నారని కన్నా మండిపడ్డారు. సీఎం చేస్తున్న అప్పులను, వాటికి వడ్డీని ప్రజలే కట్టాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల సొమ్ముతోనే ప్రజల ఓట్లు కొనుక్కునే దుష్ట ఆలోచనలకు బాబు దిగజారి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.  బీజేపీ 2019 ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా అన్ని స్థానాలకు పోటీ చేస్తునందని ఈసందర్భంగా ఆయన స్పష్టం చేశారు. 

Leave a Reply

Your email address will not be published.