‘చంద్రబాబు అరెస్ట్’ జగన్ ప్రతీకారమేనా..?

తనని ఎక్కడైతే విమానాశ్రయంలో అడ్డుకున్నారో అక్కడే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ను అడ్డుకోవాలని అవసరమైతే అరెస్టు చేయాలన్న అధికారిక ఆదేశాలతో చంద్రబాబును పోలీసులు అరెస్టు చేసినట్టు కనిపిస్తోంది. విశాఖ ఎయిర్‌పోర్టు దగ్గర వైసిపి కార్యకర్తలు చంద్రబాబువైపు దూసుకువస్తూ నినాదాలు చేస్తూన్న అడ్డుకోలేకపోయారని..పోలీసుల తీరుపై టీడీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన చంద్రబాబును పర్యటించవద్దంటూ పోలీసులు అడ్డుకున్నారు. విశాఖలో ముందుగా అనుమతి తీసుకున్నా కూడా తన పర్యటనకు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారంటూ చంద్రబాబు నిలదీసి అక్కడే భైటాయించడంతో చంద్రబాబును ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు నోటీసు అందజేసారు.
ఈ నోటీసులో ‘ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన మీ భద్రత దృష్ట్యా మిమ్ములను, మీ అనుచరులను రక్షణ నిమిత్తం సీఆర్పీఎస్ 151 సెక్షన్ ప్రకారం ముందస్తు అరెస్ట్ చేస్తూ ఈ నోటీస్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఇందుకు మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాం.’ అని విశాఖ నగర వెస్ట్ సబ్ డివిజన్ అసిస్టెండ్ కమిషనర్ పేరుతో పోలీసులు లేఖ ఇచ్చారు. దీనిపై ఎలాంటి అధికారిక ముద్ర కానీ అకుపచ్చ ఇంకుతో సంతకం కానీ లేకపోవటం విశేషం.
చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్న పోలీసులు విశాఖ విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌కు తరలించి, అక్కడి నుంచి విజయవాడ లేదా హైదరాబాద్ పంపించాలని నిర్ణయించినట్టు సమాచారం అందుతోంది. అయితే చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులు చట్ట వ్యతిరేకమని, దీనిపై కోర్టుకెళ్తామని టీడీపీ నేతలు తెలిపారు. పోలీసులు ఇచ్చిన నోటీసు పేరుతో ఇచ్చిన లేఖను టీడీపీ లీగల్ సెల్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.