కడప ఉక్కు ఫ్యాక్టరీకి సీఎం జగన్ శంకుస్థాపన

రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం.. ఉక్కు పరిశ్రమకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. సున్నపురాళ్లపల్లెలో నిర్మించనున్న ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ పారిశ్రామిక రంగంలో కడప జిల్లా పరుగులు పెట్టాలని కలలు కన్నానని గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి తర్వాత కడప జిల్లాను పట్టించుకునేవారు కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నికలకు కేవలం 6 నెలల ముందు కొబ్బరికాయ కొట్టి మోసం చేశారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో చేస్తే దానిని చిత్తశుద్ధి అంటారని చెప్పుకొచ్చారు.
రాయలసీమకు మంచి జరగాలంటే నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు రావాల్సిన అవసరత ఉందని ఆకాంక్షించారు. కడప ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మూడేళ్లలో ఈ పరిశ్రమ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రూ.15 వేల కోట్లతో ఉక్కు పరిశ్రమకు పునాది రాయి వేసుకున్నామని పేర్కొన్నారు. ఈ పరిశ్రమ ఇక్కడి రావడానికి ఎన్ఎండీసీతో ముందడుగు వేసినట్లు వివరించారు. రాష్ట్రం విడిపోయాక 5 ఏళ్లపాటు చూశాం.. ఎవ్వరూ పట్టించుకోలేదని , కడపకు న్యాయం జరిగే రోజులు మళ్లీ వచ్చాయని జగన్ వ్యాఖ్యానించారు.అంతకు ముందు సున్నపురాళ్లపల్లెకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్కు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. నేటి నుంచి మూడు రోజుల పాటు సీఎం జగన్ జిల్లాలో పర్యటించనున్నారు