కాక‌పుట్టించే ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్‌

టాలీవుడ్ లో వివాదాస్పద దర్శకుడిగా, ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ తో మీడియాలో హడావిడి చేస్తూ ట్రెండింగ్ లో ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పరిటాల రవి, వంగవీటి రంగా లాంటి యాక్షన్ రౌడీ చరిత్ర కలిగిన నాయకుల కథను తెరపై ఆవిష్కరించే సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన వర్మ మరోసారి తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత కథలో కీలక సంఘటన లక్ష్మీస్ ఎన్టీఆర్ తెరపై ఆవిష్కరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఏపీ లో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కి వ్యతిరేకంగా, అప్పటి రాజకీయ పరిస్థితులు ఎన్టీఆర్‌ను గద్దె దించడం వెనుక ఘటన తెరపై ఆవిష్కరించే ప్రయత్నం వర్మ చేస్తున్నారు. దీని వెనుక వైసిపి కుట్ర ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తూ వర్మ పై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో తన లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వర్మ తనదైన శైలిలో ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ సాంగ్స్ తో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు విపరీతమైన కోపం తెప్పించిన వర్మ తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా ట్రైలర్ పూర్తిగా లక్ష్మీ పార్వతిని పాజిటివ్ గా చూపిస్తూ అదే సమయంలో చంద్రబాబు ని ఒక విలన్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే ఎన్టీఆర్ నుంచి కుటుంబ సభ్యులు, అభిమానులు ఎలా నమ్మించి మోసం చేశారు, చంద్రబాబు వారిని ఎలా బుట్టలో వేసుకున్నారు అనే విషయాలను ట్రైలర్ లోనే ఆవిష్కరించి తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో కాకపుట్టించారు. ఈ ట్రైలర్ రిలీజ్ చేసిన కొద్దిసేపటికే రికార్డు స్థాయిలో వ్యూస్ తెచ్చుకుంటూ దూసుకుపోతుంది మరి దీనిపై చంద్రబాబు నాయుడు గాని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు గాని ఏ విధంగా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంత‌కీ వ‌ర్మ ఇందులో అన్నీ నిజాలే చూపించారా లేక ఏపాత్ర‌లోనైనా క‌ల్పితాలున్నాయా అన్న‌ది సినిమా చూస్తే తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published.