మాసిజానికి బాస్ ఈ మెగా దర్శకనిర్మాత విజయబాపినీడు ఇక లేరు

సుప్రీం హీరోగా ఉన్న చిరంజీవిని మెగా స్టార్‌గా మార్చిన దర్శకుడు… మెగాస్టార్ కి తొలిగా  కోటి పారితోషికం ఇచ్చిన మెగా నిర్మాత విజయ బాపినీడు (86)….ఇక లేరు! ఆయన దిగంతాలకు అంతర్ధానమయ్యారు. ఆయన మంగళవారం వేకువ ఝామున హైదరాబాద్లో కన్నుమూశారు. బాపినీడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు. 22 సెప్టెంబర్ , 1936లో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు సమీపంలోని చాటపర్రు గ్రామంలో జన్మించిన విజయ బాపినీడు బీఏ వరకు చదువుకున్నారు. సినీ పరిశ్రమకి రాకముందు పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్లో పనిచేశారు. ఆ తర్వాత విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకునిగా పనిచేసారు. చిరంజీవి, శోభన్ బాబు వంటి ప్రముఖ హీరోలతో సినిమాలు నిర్మించిన ఆయన దర్శకుడిగా కూడా మారారు. అప్పట్లో చిరంజీవి, బాపినీడు కాంబినేషన్ సూపర్ హిట్ అయ్యింది. పట్న ం వచ్చిన పతివృతలు, గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్, ఖైదీ నెంబర్ 786, మగధీరుడు, సుమంగళి, వాలుజడ తోలు బెట్లు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు బాపినీడు దర్శకత్వం వహించారు. 1976 నిర్మించిన యవ్వనం కాటేసింది అనే సినిమాతో బాపినీడు నిర్మాతగా మారారు. ఆయన అంత్యక్రియలు గురువారం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. ఆయన పెద్దమ్మాయి అమెరికా నుంచి రావల్సి ఉంది.

బాపినీడు మెగా నిర్మాత ఎందుకు అయ్యారు?
చిరుకి అత్య ంత సన్నిహితుడిగా మెలిగిన ఆయన అరడజను గొప్ప బ్లాక్ బస్టర్లు ఇచ్చిన చరిత్రకారుడు.  ఖైదీ నంబర్ 786, గ్యాంగ్‌లీడర్ వంటి సూపర్‌హిట్ చిత్రాల్ని అందించి చిరు స్థాయిని మరింత పెంచిన దర్శకుడిగా గుర్తింపు పొందారు.  మెగా అభిమానుల ప్రేమని పూర్తిస్థాయిలో పొందిన అగ్ర దర్శకనిర్మాత విజయబాపినీడు. పరిశ్రమలో అందరివాడుగానూ గుర్తింపు పొందారు. పాత్రికేయునిగా విలువల్ని పాటించిన ఘనత ఆయనకు ఉంది.

దర్శక, నిర్మాత విజయ బాపినీడు భౌతిక కాయానికి ప్రముఖ కథానాయకుడు చిరంజీవి నివాళులర్పించారు. బాపినీడు ఇకలేరన్న సమాచారం అందుకున్న చిరంజీవి బంజారాహిల్స్లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. బాపినీడు మరణం తననెంతగానో కలచివేసిందని చిరంజీవి అన్నారు. హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఆయన ఇంట్లోనే ఉన్నానని గుర్తు చేసుకున్నారు. బాపినీడుతో ఆరు సినిమాలు చేశానని, తన అభిమానులంటే ఆయనకు ఎంతో ఇష్టమని అన్నారు. ఇతర హీరోలతో కూడా సినిమాలు చేయొచ్చు కదా.. అని నేను ఆయనతో అంటూ ఉండేవాడ్ని. నాతో సినిమాలు తీయడం ప్రారంభించిన తర్వాత ఆ కంఫర్ట్ కానీ, సెంటిమెంట్ కానీ మరొకరితో కుదరడంలేదని
అన్నారు. నేను హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో ఎక్కడ ఇల్లు తీసుకోవాలా? అని అనుకుంటున్న సమయంలో ఆయన గెస్ట్ హౌస్‌లో ఉండమని చెప్పారు. చాలా కాలం పాటు అక్కడే ఉన్నాను అని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీనియర్ నటుడు మంచు మోహన్బాబు, నటుడు శివాజీ రాజా  బాపినీడు నివాసానికి చేరుకుని. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థించారు.

Leave a Reply

Your email address will not be published.