రాష్ట్రపతి భవన్లో క్రిష్ సినిమా!
క్రిష్ దర్శకత్వం వహించిన ఓ సినిమాని దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ముందు ప్రదర్శించనున్నారు.. ఇంతకీ ఏ సినిమా అది? ఈ ప్రశ్నకు సమాధానం ఇదిగో…
టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించిన ఓ సినిమాని రాష్ట్రపతి భవన్లో ప్రత్యేకంగా దేశ ప్రధమ పౌరుడు రాష్ట్రపతి కోసం ప్రదర్శించనున్నారు. ఆ సినిమా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్.టి.రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన `ఎన్టీఆర్- కథానాయకుడు` అనుకుంటే తప్పులో కాలేసినట్టే. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మనసుపడి.. చూడాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమా వేరొకటుంది… గ్రేట్ వారియర్ క్వీన్ ఝాన్సీ రాణి జీవితకథను ఆయన తెరపై చూడాలనుకుంటున్నారు. కంగన రనౌత్ నటించిన `మణికర్ణిక` కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారట. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ని చూసిన రాష్ట్రపతి ఝాన్సీ లక్ష్మీభాయ్ పాత్రలో కంగన నటనకు ముగ్ధులయ్యారట. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ చిత్రాన్ని వీక్షించాలనే కోరికను ఆయన బయటపెట్టారట. ఆయన కోరిక మేరకు చిత్ర బృందం శుక్రవారం రాష్ట్రపతి భవన్లో ప్రత్యేకంగా ప్రదర్శనను ఏర్పాటు చేసింది.
రాష్ట్రపతి దంపతులతో పాటు పలవురు రాజకీయ నాయకులు, మరియు చిత్ర బృందం పాల్గొననున్నారని తెలిసింది. 80 శాతం సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించాక, మిగతా 20 శాతం కంగన డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. అటుపై క్రిష్ అలక పానుపు ఎక్కిన సంగతి విదితమే. ఎన్టీఆర్ బయోపిక్ గురించి తెలిసిన తరువాత ఆ చిత్రాన్ని మధ్యలోనే వదిలేసిన క్రిష్ బయటికి వచ్చేశాడు. దీంతో మిగతా భాగాన్ని పూర్తిచేసే బాధ్యతల్ని కథానాయిక కంగన తీసుకుని విజయవంతంగా పూర్తిచేసింది. `మణికర్ణిక` చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేస్తున్నారు. విడుదలకు వారం ముందే రాష్ట్రపతి కోసం ప్రదర్శిస్తుండటం ఇదే ప్రధమం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.