మనం ప్రజా స్వామ్యంలో ఉన్నామా? లేక..తులసి రెడ్డి ఆగ్రహం..
ముఖ్యమంత్రి జగన్కు మంత్రులు కట్టు బానిసల్లా మారినట్టు కనిపిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, తులసి రెడ్డి ఘాటుగా విమర్శించారు. గురువారం ఆయన తన నివాసంలో మీడియాలో మాట్లాడుతూ విశాఖ, విజయనగరం జిల్లాలలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి పర్యటనను అడ్డుకోవాలని మంత్రులు పిలుపునివ్వడం అప్రజాస్వామికం అన్నారు. మంత్రులే పెద్ద సంఖ్యలో పెయిడ్ ఆర్టిస్టులని విమానాశ్రయానికి పంపారని, వారిని నిలువరించవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు.
మనం ప్రజా స్వామ్యంలో ఉన్నామా? లేక రాజరిక పాలనలోనా అన్న అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. ఓవైపు చంద్ర బాబుపై దాడి చేయాలంటూ మంత్రులు పిలుపునిస్తారు. శాంతి భద్రతల సమస్యంటూ విపక్ష నేతలు ప్రజలలోకి వెళ్లకుండా పోలీసులతో అడ్డుకుంటారని భగ్గుమన్నారు. అసలు అరెస్టు చేయాల్సింది చంద్రబాబుని కాదు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్న మంత్రులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేసారు. గతంలో తనని విశాఖ ఎయిర్ పోర్టులో నిలువరించారు కనుక ఇప్పుడు చంద్రబాబుపై అలానే చేయాలని పోలీసులకు సూచించి ముఖ్యమంత్రి జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టుందని ఆగ్రహం వ్యక్తం చేసారు తులసి రెడ్డి..