కేంద్రమంత్రిగా పవన్‌ కళ్యాణ్‌…?

బిజెపితో పవన్‌కళ్యాణ్‌ కలిసి పనిచేసేందుకు సిద్ధం కావ‌టంతో ప‌వ‌న్ అభిమాన గ‌ణం యావ‌త్తు త‌మ వెంట న‌డిచే ఆస్కారం ఉంది క‌నుక ఇక పార్టీని బ‌లోపేతం చేసుకుని టార్గెట్ 2024- అధికార‌మే ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌ని క‌మ‌ల‌నాధులు భావిస్తున్నారు. అయితే ఆంధ్ర రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయం వైపు ఓటర్లు ఎంత‌వ‌ర‌కు మొగ్గు చూపుతార‌న్న సంశ‌యం లోలోన క‌నిపిస్తున్నా… తెలుగుదేశం పార్టీ నుంచి మ‌రింద‌రు నేత‌ల‌ను పార్టీలోకి ర‌ప్పించడం ద్వారా ఆ పార్టీని బ‌ల‌హీన ప‌ర‌చడం ద్వారా టిడిపి స్థానంలోకి తాము ఎగ‌బాకాల‌న్న ల‌క్ష్యం బిజెపి నేత‌ల‌లో క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే చాలా మంది టిడిపి నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం.
కాగా ఇప్ప‌టివిర‌కు టిడిపి నుంచి జంప్ అయిన ఎంపిలలో సుజ‌నా చౌద‌రి, సిఎం ర‌మేష్‌, టిజె వెంక‌టేష్‌లు అడ‌పా ద‌డ‌పా మీడియా ముందుకు వ‌చ్చి మాట్లాడుతుంటే… జివిఎల్ లాంటి వాళ్లు నేను చెప్పిందే ఇక్క‌డ వేదం… అదే శాస‌నం, నా మాటే పార్టీ మాట అంటూ ఎదురుదాడులు చేస్తుండ‌టంతో జంపింగ్‌ల మాట చెల్లు బాటు కానట్టే క‌నిపిస్తోంది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు సైకిల్ దిగి క‌మ‌లాల‌ను అందుకున్న నేత‌లు మాట్లాడిన దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు. ద‌యాక‌ర్ లాంటి వాళ్లు మీడియా చ‌ర్చ‌ల‌లో పాల్గొంటున్నా పూర్తి స్థాయిలో పార్టీ నిర్ణ‌యాల‌ను చెప్ప‌లేక పోతుండ‌టానికి కూడా ఇదే ఒక కార‌ణంగా క‌నిపిస్తొంద‌న్న‌ది క‌మ‌లం పార్టీ కార్య‌క‌ర్త‌లే చెపుతున్న మాట‌.  
నేత‌లు ఇంత మంది ఉన్నా పార్టీ బ‌లోపేతం కాక‌పోవ‌టానికి కార‌ణాలు అన్వేషిస్తున్న కొంద‌రు   పవన్‌కళ్యాణ్‌కు అదికార హోదా కల్పించడం ద్వారా పార్టీని జ‌నంముందుకు తీసుకువెళ్లొచ్చ‌ని అధిష్టానానికి సూచించిన‌ట్టు తెలియ‌వ‌చ్చింది. ఈ విష‌య‌మై ప్రధాన మంత్రి మోడీ దృష్టికి హోమంత్రి బిజెపి అధ్య‌క్షుడు అమిత్ షా తీసుకువెళ్ల‌గా, ప్ర‌ధాని బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడు నడ్డాని పిలిపించుకుని ఏపిలో పార్టీ ప‌రిణామాల‌పై  చర్చించారని విశ్వసనీయ వర్గాల సమాచారం.  ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి కేంద్రంలో కీలకమైన పదవి ఇస్తే త‌ద్వారా ఆంథ్రరాష్ట్రంలో ఓ వ‌ర్గ ప్ర‌జ‌ల‌లో న‌మ్మ‌కాన్ని తీసుకురావ‌చ్చ‌ని త‌ద్వారా బిజెపి, జనసేన పార్టీలు రెండూ బలపడతాయని దీంతో టార్గెట్ 2024 చేరుకోవ‌చ్చ‌ని స్థానిక బిజెపి నాయకుల నుంచి అందిన నివేదిక‌ల‌ను న‌డ్డా షా- మోడీలకు అందించార‌ని తెలియ‌వ‌చ్చింది. దీంతో  కేంద్ర క్యాబినేట్ లోకి ప‌వ‌న్‌ని తీసుకునే అవ‌కాశం ఉంద‌ని, లేని ప‌క్షంలో   స్వతంత్ర హోదా గల పదవి సృష్టించి ఇచ్చే అవకాశాన్ని  కూడా ప‌రిశీలిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇదే అంశంపై ఢిల్లీలో జ‌రిగిన చ‌ర్చ‌ల సంద‌ర్భంగానూ    కేంద్ర బిజెపి పెద్దలు పవన్‌కళ్యాణ్ కు స్ప‌ష్ట‌మైన స‌మాచార‌మే ఇచ్చార‌ని, తెలుస్తోంది. 
అయితే చిరంజీవి ప్ర‌జా రాజ్యం పార్టీని న‌డ‌ప‌లేకే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర మంత్రి ప‌ద‌వి అందుకున్నార‌ని, దీని వ‌ల్ల కాంగ్రెస్‌కి ఉప‌యోగం లేకుండా పోయింద‌ని, ముఖ్యంగా తెలుగురాష్ట్రాల‌లో ఉన్న మెగా అభిమానులు కూడా త‌మ హీరో ఉన్న పార్టీకి క‌నీస ఓట్లు కూడా వేయ‌క‌పోవ‌టంతోనే ఆ పార్టీ తుడుచుపెట్టుకుపోయిన అంశాన్ని తెర‌మీద‌కు తెస్తున్నారు కొంద‌రు.  మ‌న పార్టీని బ‌లోపేతం చేయాలంటే రాష్ట్రానికి త‌గిన నిధులు, ఇత‌ర‌త్రా స‌హాయాలు అవ‌స‌రం కానీ  పవన్‌ కళ్యాణ్‌కు  కేంద్ర మంత్రి పదవి ఇస్తే అదనపు లాభం చేకూరే అవకాశాలు ఏమాత్రం లేవ‌న్న‌ది వీరి వాద‌న‌.  ప‌వ‌న్‌కి ప‌ద‌వి ఇస్తే, ఆ పార్టీని బ‌లోపేతం చేసుకుంటారు, లేదంటే మాజీ స్పీకర్‌ నాదెండ్ల‌ మనోహర్ లాంటి వారికి ప‌ద‌వులు ఇప్పించుకుంటారు  మిన‌హా దాని వ‌ల్ల పార్టీకి ఉప‌యోగం  ఉండ‌ద‌న్న వాద‌న‌ల‌పై  బిజెపి పెద్దలుఇప్ప‌టికే ఇదే అంశంలో కొంతమంది కేంద్ర నిఘా అధికారులతో  రహస్యంగా  విచారించుకున్న‌ట్టు తెలియ‌వ‌చ్చింది. పవన్‌కళ్యాణ్‌కు ‘పవర్‌’ కల్పిస్తే ఎంతో కొంత అదనపు లాభం చేకూరుతుందని కొంద‌రు చెపుతుండ‌గా పవన్‌కళ్యాణ్‌కు కేంద్ర మంత్రి పదవి ఇస్తే… బిజెపికి అదనపు లాభం కలుగుతుందా? అన్న వాద‌న‌ల న‌డుమ అధిష్టాన పెద్ద‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నారని క‌మ‌లం పార్టీ నుంచి అందుతున్న స‌మాచారం. మ‌రి ఏం జ‌ర‌గ‌నుందో చూడాలి.   

Leave a Reply

Your email address will not be published.