ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సి ల పై జగన్ ప్రభుత్వం యూ టర్న్

జాతీయ పౌరసత్వ సవరణ చట్టంతో పాటు జాతీయ పౌరసత్వ నమోదుకు సంబంధించిన బిల్లులను పార్లమెంట్‌లోసమర్థించిన  వైఎస్సార్ కాంగ్రెస్ ఇప్పుడు దానిని అమ‌లు చేసేందుకు అనుమ‌తించ‌బోమ‌ని చెప్ప‌డం విశేషంగా క‌నిపిస్తోంది.   ఢిల్లీతో స‌హా ప‌లు ప్రాంతాల‌లో  ఈ చ‌ట్టాల‌ను వ్యతిరేకిస్తూ ప్రారంభమైన అల్లర్లు  అటు తెలంగాణని, ఇటు ఏపిని తాక‌డంతో వైసిపి త‌న స్వరం మార్చడం గ‌మ‌నార్హం. దీనికి తోడు సొంత పార్టీ శాస‌న‌స‌భ్యులు కూడా ఈ చ‌ట్టం అమ‌లు కాకుండా అసెంబ్లీలో తీర్మానం చేయ‌కుంటే త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తామంటూప్ర‌క‌టించ‌డం, ప‌లు ముస్లిం సంస్ధ‌లు కూడా నిర‌స‌న‌ల‌కు దిగ‌టం, దీనికి తోడు ఎంఐఎం అధినేత అక్బ‌రుద్దీన్ గుంటూరులో భారీ బ‌హిరంగ పెట్ట‌డంతో రాష్ట్రంలోని అధికార వైసిపిపై బాగానే వ‌త్తిడి పెంచింద‌ని చెప్పాలి. 


 కేంద్రం నుంచి స్పష్టత వచ్చే వరకు ఎన్‌పీఆర్‌ ను నిలుపుదల చేయాలని రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేసింది. ప్రస్తుతం ఉన్న ఎన్‌పీఆర్ ప్రశ్నల నమూనాను మార్చాలని కేబినెట్ తీర్మానించింది. ప్రస్తుత నమూనాలో కొన్ని అభ్యంతరకరమైన ప్రశ్నలు ఉన్నాయని వాటిని తొలగించి 2010 నాటి ప్రొఫార్మాలో పొందుపరచిన అంశాలనే యథాతధంగా కొనసాగించాలనే వాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

 కేంద్ర మంత్రివర్గంలో వైసీపీ చేరనుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎన్‌పీఆర్‌పై మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ఏ పరిణామాలకు దారి తీస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్‌పీఆర్‌పై శాసనసభ సమావేశాల్లో కూడా తీర్మానం చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేయ‌టంతో కేంద్రం ఏ రకంగా స్పందిస్తుందన్న ఆందొళ‌న వైసిపి వ‌ర్గాల‌లొనూ క‌నిపిస్తొంది

Leave a Reply

Your email address will not be published.