సిపిఎస్‌ రద్దు విషయంలో కప్పదాటు వైఖరిని అవలంబిస్తున్నారా ?

అధికారంలోకి వచ్చిన వారం రోజులలో సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేస్తానని పాదయాత్రలో పదే పదే జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఆరు రోజులే కాదు.. ఏడు నెలలు గడిచినా సిపిఎస్‌ రద్దు ఊసే ఎత్తడం లేదు. వారం గడిచింది.. నెలలు గడిచింది మళ్లీ కొత్త కమిటీలతో కాల యాపన చేస్తున్నారని ప్రతిపక్షం నిలదీసింది. సిపిఎస్‌ విధానాన్ని అసలు రద్దు చేస్తారా… ఏడు రోజులు అన్నారు. ఏడు నెలలు గడిచాయి.ప్రభుత్వానికి అసలు ఆ ఉద్దేశం ఉందా.. లేదా అని సమాధానం చెప్పాల్సిన ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్‌రెడ్డి తనను కలిసిన ఉద్యోగ సంఘాల నాయకులతో, మీడియా వారితో అసహనంగా మాట్లాడుతూ… మా ఎన్నికల మ్యానిఫెస్టోలో సిపిఎస్‌ను రద్దు చేస్తామని చెప్పాం… కానీ ఈ సమయానికి రద్దు చేస్తామని చెప్పలేదు. తాజాగా రద్దు చేయాలని ప్రతిపక్ష నేతలు, ఉద్యోగ సంఘాల నాయకులు మా మెడ మీద కత్తి పెడితే ఎలా అని ఎదురు దాడి చేశారు. అంతే కాకుండా సిపిఎస్‌ కమిటీ మార్చి మాసాంతానికి నివేదిక వస్తుంది. ఆ తరువాత మంత్రి వర్గంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు బుగ్గన. మీ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన వారం రోజులలో సిపిఎస్‌ రద్దు చేస్తామన్నారు… మీరు ఏమో ఇంత సమయానికి రద్దు చేస్తామని చెప్పలేదంటున్నారు. మా ముఖ్యమంత్రి మడం తిప్పరు… మాట తప్పరు.. అని మీరే అంటుంటారు. సిపిఎస్‌ రద్దు విషయంలో కప్పదాటు వైఖరిని అవలంబిస్తున్నారా అని అడిగితే.. ఆర్దిక మంత్రి అంత ఎత్తున ఆవేశంతో ఎగిరిపడుతున్నారట. ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. కమిటీ నివేదిక ఇస్తుందా… లేక మరి కొంత సమయం తీసుకుంటుందా వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published.