ఇచ్చిన హామీలు గాలికేనా?

గత ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారిని పోటీకి దింపేందుకు వీలుగా పాత కాపులను కాస్త పక్కకు పెట్టారు జగన్ వీరందరికీ మండలి, రాజ్యసభలతో సహా పలు కార్పొరేషన్లు, ప్రభుత్వ సలహాదారులు ఇలా పలు పదవులను అందించే హామీని ఇచ్చేసారు. దీంతో పదవులు ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. పోటీ చేసే అవకాశం లభించకపోయినా.. ఎన్నికలలో పార్టీ అభ్యర్ధుల గెలుపుకు సహకరించారు.
ఇప్పుడు రాజ్యసభ సీట్ల విషయం బొత్స సత్యనారాయణ మీడియా ముందు ప్రస్తావించడం, అందునా ప్రత్యేకంగా సినీ నటుడు చిరంజీవిపేరు తెరపైకి తెస్తూనే, అధినేత నిర్నయం తీసుకుంటారంటూ సాగదీత వచనాలు పలికిన క్రమంలో ప్రస్తుతం ఇది కాస్త రచ్చగా మారేలా ఉంది. గతంలో ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులు ఇస్తానంటూ జగన్ వాగ్దానం చేయగా తాజాగా మండలిని రద్దు చేయటానికి నిర్ణయించడంతో ఎమ్మెల్యేలుగా పోటీ చేసే ఛాన్స్ మిస్సయినా ఎమ్మెల్సీలుగా పదవుని అలంకరించొచ్చని భావించిన నేతల ఆశలపై నీళ్లు కుమ్మరించినట్టయ్యింది. ఇప్పటికే వీరంతా తమకిచ్చిన హామీలు గాలికేనా? అని మధన పడుతున్న తరుణంలో చాలామందికి త్వరలో ఖాళీకానున్న రాజ్యసభ సీట్లపై కన్ను పడింది…
ఇప్పటికే నరసరావుపేటలో ఎంపీ సీటును అయోధ్యరామిరెడ్డి కి రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పడంతో ఆయన త్యాగం చేయగా.. నెల్లూరు లోక్‌సభ సీటును మంత్రి గౌతంరెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి కీ ఇదే హామీ లభించడంతో త్యాగం చేయాల్పి వచ్చింది . ఇక ముఖ్యమంత్రి జగన్‌కు సమీప బందువైన టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి ఒంగోలు లోక్‌సభ సీటును త్యాగం చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి తనకు ఎమ్మెల్యేసీటు ఖరారు చేయటండి లేదా నరసరావుపేట ఎంపీ సీటు అయినా ఇవ్వండి అని మొత్తుకున్నా.. ఓడిపోతే రాజ్యసభకు పంపిస్తామంటూ గుంటూరు ఎంపీగా పోటీ చేయించారు. ఆ వేవ్‌లో ఆయన గెలిచే వారే. కానీ స్థానిక అంశాల ప్రభావం,. కాలం కలిసి రాక స్వల్ప తేడాతో ఓడిపోయారు. దీంతో గతంలో తనకు ఇచ్చిన హామీ మేరకు రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు ప్రారంభించారంటూ తెలుస్తోంది. ఇక విజయవాడలో పోటీకి దిగి ఓడిపోయిన పివిఆర్ సైతం తన ప్రయత్నాలలో తను ఉన్నట్టు కనిపిస్తోంది.
ఇందుకు అనుగుణంగానే జరుగుతున్న పరిణామాలు సైతం ఉన్నట్టు కనిపిస్తున్నాయి. గత కొంత కాలంగా మంత్రి వర్గం విస్తరిస్తే తనకు పదవి లభిస్తుందని భావిస్తున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లరామకృష్ణారెడ్డి సైతం ఇటీవల జగన్‌ను కలిసి తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు.. కానీ మా బావలు అయోధ్యరామిరెడ్డికి కానీ, మోదుగులకు కానీ రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది.
అలాగే మంత్రి గౌతంరెడ్డి. సైతం తన తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి 2019 ఎన్నికలలో ఇచ్చిన హమీ మేరకు తన ఎంపీ సీటును వేరే వారికి ఇచ్చేందుకు అంగీకరించారని ఆయనకు రాజ్యసభ సీటు కచ్చితంగా దక్కుతుందని చెపుతున్నారు. మరోవైపు టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి కూడా తనకు రాజ్యసభ సభ్యత్వం అందించాలని కోరుతున్నట్టు సమాచారం .
ఈ నేపధ్యంలో ఎంపీ సీటును త్యాగం చేసి పార్టీ అభ్యర్దుల గెలుపుకు సహకరించి త్యాగ రాజులుగా పేరు తెచ్చుకున్న మేకపాటి, వైవి.సుబ్బారెడ్డి, అయోధ్యరామిరెడ్డిలలో ఒకరికి మాత్రమే రాజ్యసభ సీటు దక్కే అవకాశాలున్నాయని జగన్ పార్టీ నేతలు చెబుతున్నారు. మోదుగులకు రాజ్యసభ సీటు దక్కే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించటం లేదని భవిష్యత్తులో మరో పదవి ఇచ్చే అవకాశాలున్నాయని వైసిపి నేతలు అంటున్నారు.
ఇక మండలి రద్దుతో మంత్రి వర్గంలో స్థానం కోల్పోనున్న పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను రాజ్యసభకు పంపిస్తామని హామీని నిలుపుకోవటంతో పాటు మెగాస్టార్ చిరంజీవిని పార్టీలోకి తీసుకుని రాజ్యసభ సీటు ఇవ్వటం ద్వారా పవన్ కళ్యాణ్‌ని కట్టడి చేయచ్చంటూ ఢిల్లీ పెద్దలు చేసిన సూచనలతో మంత్రి బొత్స ఈ ప్రస్థావన తీసుకువచ్చినట్టు కనిపిస్తోందని ఆ పార్టీలోనే వినిపిస్తున్న గుసగుస, ఈ విషయంపై అప్పుడే సామాజిక మీడియాలో చిరంజీవి వైసిపిలోకి అంటూ ట్రోల్ చేయటం ఆరంభించేసారు.
మరి వస్తున్న కథనాలు, బొత్స రెండు నెలలాగండి అంటూ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే పరిస్థితి ఎటువైపు వాలుతుందో? ఎవరికి అందలం అందుతుందో చూడాలి.