పక్షపాతం గా వ్యవహరించిన అధికారులపై చర్యలు తప్పవు : ఈసీఎంపీటీసీజడ్పీటీసీ నామినేషన్ల సందర్భంగా గుంటూరు జిల్లా మాచర్ల, చిత్తూరు జిల్లాల్లో  చోటుచేసుకున్న  హింసాత్మక ఘటనలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, కొందరు అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని ఈసీ రమేష్‌కుమార్‌ అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. హింసాత్మక సంఘటనలు, బెదిరింపులు చోటు చేసుకోవడం ఆందోళ‌న క‌ర ప‌రిణామ‌మ‌ని అన్నారు. అధికార యంత్రాంగం పూర్తిగా పక్షపాత ధోరణితో వ్యవహరించిందని, హింసాత్మక ఘటనల్ని అడ్డుకోలేదని, ఉదాసీనంగా వ్యవహరించిందని స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఈసీ. పరిస్థితిని అదుపుచేయడంలో విఫలమైన గుంటూరు, చిత్తూరు కలెక్టర్, ఎస్పీలను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. వీరి స్థానంలో ప్రత్యామ్నాయ అధికారులను నియమించాలని ఆదేశించింది.

మాచర్లలో జరిగిన హింసాత్మక సంఘటన అక్క‌డి సిఐ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన వ్య‌వ‌హారంపై  మండి ప‌డిన ఈసీ, మ‌నుష్యుల్ని చంపేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు స్ప‌ష్ట‌మైన ఆధారాలున్నా సాధార‌ణ కేసు గా నమోదు చేసి, నిందితులకు వెనువెంటనే స్టేషన్ బెయిల్ ఏ ప్రాతిప‌దిక‌న ఇచ్చార‌ని ప్ర‌శ్నించింది.   దీనికి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ బాధ్యత వహించాలని  ఆత‌న్ని తక్షణం సస్పెండ్ చేయాల‌ని ఆదేశాలిచ్చింది. అలాగే  శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలను, తిరుపతి, పలమనేరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను, మరికొందరు పోలీసు అధికారులను  బదిలీ చేయాలని  డిజిపికి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీచేసింది. 

 తిరుపతి, మాచర్ల, పుంగనూరుల్లో జ‌రిగిన హింసాత్మక సంఘటనలను ప‌రిశీలించామ‌ని, కొంద‌రు ప్ర‌త్య‌ర్ధి పార్టీకి చెందిన అభ్య‌ర్ధుల‌ను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవ‌టంతో పాటు  బెదిరించడం, పత్రాలను చించివేయడం పెద్దఎత్తున జరిగినట్లు ప్రాథమికంగా నిర్థరణకు వచ్చామని తెలిపింది. ఈ నేపథ్యంలో అవసరమైతే ఆరు వారాల తర్వాత కొత్త షెడ్యూల్   ప్రకటిస్తామని ర‌మేష్ కుమార్ చెప్పారు. 

Leave a Reply

Your email address will not be published.