ఏకగ్రీవ పంచాయితీలకు భారీ నజరానా

రెండు విడతల్లో జరిగే స్థానిక ఎన్నికలకు ఈ నెల 27, 29న పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే మంత్రులకు టార్గెట్లు పెట్టి, గెలవకుంటే మీ ఉద్యోగాలు పోతాయంటూ చెప్పిన జగన్ తాజాగా ఏకగ్రీవాలెక్కువ కావాలని నిర్దేశించారు. ఇందుకు అనుగుణంగా గ్రామాల్లో సర్పంచ్‌లతోపాటు వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికైతే ఆ గ్రామాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందించేందుకు నిర్ణయించినట్టు సమాచారం.
గ్రామ పంచాయతీల ఎన్నికలు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా జరిగే నేపథ్యంలో ఏకగ్రీవ పంచాయితీలకు గ్రామ జనాభా ఆధారంగా రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నజరానా ఇవ్వాలని జగన్ సూచనల మేరకు ప్రతి పాదనలను రూపొందించిన పంచాయతీరాజ్‌శాఖ వాటి నివేదికలని ప్రభుత్వానికి పంపింది. గ్రామాల అభివృద్ధికి ప్రజా భాగస్వామ్యం ముఖ్యమనే ఈ ప్రోత్సహకాలను ప్రభుత్వం అందజేయనుందని అధికారిక వర్గాలు చెపుతున్నాయి. స్థానికంగా పన్నుల రూపంలో వసూలు చేసుకునే పంచా యతీలలో ఏకగ్రీవమయ్యే వాటికి పన్నుల మొత్తానికి సమానమైన నిధులు అందజేసేలా ఈ నివేదికలు ఉన్నట్టు సమాచారం.
కాగా ఇప్పటికే ఏకగ్రీవాల మాటున ఇతర పార్టీల నేతలు పోటీకి దిగితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఎర్రచందనం కేసులు పెట్టేందుకు కూడా వెరవబోమని అధికారిక వర్గాలు వీరంగం వేస్తున్నట్టు బిజెపి అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ చేసిన ఆరోపణ సంచలనమైంది. ఇప్పుడు నిధుల ముసుగులో ప్రలోభాలకు గురిచేసి, వాలంటీర్ల వ్యవస్ధతో ఏకగ్రీవాలతో మెజార్టీ పంచాయితీలను తన ఖాతాలో వేసుకోవాలని అధికార పార్టీ చూస్తోందన్న ఆరోపణలపై స్పందించేందుకు వైసిపి నేతలు నిరాకరిస్తున్నారు. పైగా గతంలో మీరు అంటూ ప్రత్యారోపణలు చేస్తూ, ఇప్పుడు మాకు ఛాన్సొచ్చింది అంతే అని సమాధానమివ్వటం గమనార్హం.