గద్దె రామ్మోహన్‌రావు దీక్షకు చంద్రబాబు సంఘీభావం

తనపై ఉన్న కోపాన్ని అమరావతిపై చూపించొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. విజయవాడలో టీడీపీ నేత గద్దె రామ్మోహన్‌రావు చేపట్టిన దీక్షకు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరావతిలో ఇప్పటికే అన్ని భవనాలు ఉన్నాయని చెప్పారు. అక్కడ పైసా ఖర్చుపెట్టాల్సిన పని లేదన్నారు. కమిటీల పేరుతో వైసీపీ నేతలు ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగితే దర్యాప్తు చేయాలని కోరారు. అన్ని ప్రాంతాల వాళ్లు అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరుతున్నారని గుర్తుచేశారు. మన పిల్లలు వేరే ప్రాంతాలకు వెళ్లకూడదనే అమరావతికి శ్రీకారం చుట్టామని తెలిపారు. అమరావతిలో పునాదులు వేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుందన్నది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు.

రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు విశాఖ చాలా దూరంగా ఉందన్నారు. విశాఖను ఫార్మా హబ్‌, పర్యాటక కేంద్రంగా మార్చాలని అనుకున్నామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా నాగరికత వెలిసిందే నదుల పక్కనేనని పేర్కొన్నారు. రాజధానిపై సీఎం, మంత్రులు రోజుకు ఒకలా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజకీయ చైతన్యానికి విజయవాడ మారుపేరని అభివర్ణించారు.

Leave a Reply

Your email address will not be published.