పెళ్లి ఖర్చులిచ్చేసి ఓ ఇల్లాలిని తీసుకెళ్లిన ప్రియుడు
పెళ్లయినా వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చిన ఓ ఇల్లాలి చర్యలు కుటుంబంలో చిచ్చు రేపాయి. ఇది కాస్తా ప్రియుడితో పారిపోయి పట్టుబడటం, గ్రామ పెద్దలకు చేరటం, పెళ్లి ఖర్చులు తిరిగి ఇచ్చేసి ఆ ఇల్లాలిని తీసుకెళ్లిపోవచ్చంటూ వారు తీర్మానించేయటం ఇలా సాగింది. ఇందుకు సంబంధింత వీడియో ఇప్పుడు సామాజిక మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే ఒడిశాలోని సుందర్ గడ్ జిల్లా మడియా కుదర్ గ్రామానికి చెందిన యువతికి చిరుబెడా గ్రామానికి చెందిన పురాణ్ సింగ్ అనే యువకుడితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అయితే ఆమెను కుటుంబ సభ్యులంతా ముండాఝోరొ గ్రామానికి చెందిన యువకుడికి ఇచ్చి మేలో వివాహం జరిపించారు. అయితే ఆ మహిళ ఓవైపు భర్తతో కాపురం చేస్తూనే ప్రియుడినీ తరచూ ఆమె కలుస్తుండేది. ఈ విషయాన్ని పసిగట్టిన భర్త, ఆమెతో గొడవపడేవాడు. ఇది కాస్త రోజు రోజుకీ పెద్దదవుతుండటంతో భర్త మాటలు భరించ లేక ప్రియుడిని పిలచి పారిపోదామని చెప్పింది. అందుకు ఆతడు అంగీకరించడంతో పురాణ్సింగ్ నిర్ణయించిన సమయానికి ఆమె బస్టాండ్ చేరుకుంది. ప్రియుడి రాకకోసం ఎదురు చూస్తున్న సమయంలో గ్రామస్తులకు పట్టుబడింది.
దీంతో అక్కడే మాటు వేసిన భర్త తరపు బంధువులు కొందరు బస్సెక్కిపోవాలని ప్రయత్నంలో ఉన్న ఇద్దరినీ పట్టుకుని గ్రామానికి తీసుకువచ్చారు. ఈ ప్రేమికులు ఇద్దరినీ తాళ్లతో కట్టేసిన గ్రామస్తులు, పురాణ్ సింగ్ కుటుంబ సభ్యులను పిలిపించి విషయం వివరించారు. ప్రేమికుల వ్యవహారంపై గ్రామ పెద్దలు మండి పడ్డారు. దీంతో మేం కలిసే వుంటామని ఆ ప్రేమికులు తేల్చి చెప్పడంతో చేసేది లేక, ఆ యువతి భర్త గతంలో పెళ్లి నిమిత్తం ఖర్చుపెట్టిన రూ.1.50 లక్షలు తిరిగి ఇచ్చేసి, నచ్చిన చోటుకు వెళ్లిపోవచ్చని తీర్పు చెప్పారు.
అయితే దీనికి అంగీకరించిన పురాణ్ సింగ్, అప్పటికప్పుడు రూ.50 వేలు తెచ్చి ఇచ్చి, మిగతా డబ్బు త్వరలోనే ఇస్తానని చెప్పి, ప్రియురాలిని తీసుకుని వెళ్లిపోయాడు ఈ మొత్తం వ్యవహారాన్నిసెల్ ఫోన్లలో చిత్రీకరించిన కొందరు సోషల్ మీడియాలో పెట్టడంతో, అది వైరల్ అవుతోందిప్పుడు