ఇక్క‌డ స్థ‌లాలిచ్చి పేద‌ల‌ను మ‌రింత పేద‌లుగా మార్చేస్తారా?


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి  వ్య‌తిరేకంగా  రాజధాని గ్రామాల ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున రోడ్డెక్కి అప్పుడే 80 రోజులు దాటిపోయింది. వీళ్ల‌ని క‌ట్ట‌డి చేసేందుకు రాజ‌ధాని ప్రాంత భూముల‌లో పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాలిస్తామంటూ వ‌ల విసిరింది వైసిపి స‌ర్కారు.  దీంతో అమరావతిలో ఇప్పుడు కొందరు జగన్‌కు మద్దతుగా టెంట్లు వేశారు . బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో  అధికార వికేంద్రీకరణను సమర్థిస్తూ… అమరావతిలో టెంట్లు వెలిశాయి.  త్వరలో పేదలకు ప్రభుత్వం 50వేల ఇళ్ల పట్టాల్నిస్తే అడ్డుకోవాలని చూస్తే దాడులు చేస్తామ‌ని  బహుజన పరిరక్షణ సమితి హెచ్చ‌రిస్తోంది. 


 కేవ‌లం కృష్ణ గుంటూరు జిల్లాల్లోనే పేదలకు పంచాల్సిన భూముల పరిమాణం 4 వేల ఎకరాలుగా అధికారులు లెక్క తేల్చి, భూములను సేకరించడం ఆరంభించినా, ఎక్క‌డిక‌క్క‌డ నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  అయినా తాజా పరిణామాల నేప‌థ్యంలో  అమరావతి రాజధాని పరిధిలోకి వచ్చే గ్రామాల్లో 4 వేల ఎకరాలను సేకరించాల్సిందేన‌ని ప్ర‌భుత్వం అధికారుల‌కు  ఆదేశాలిచ్చింది. 

ఇప్పటికే తాము ఇచ్చిన భూములకు రిటర్న్ ప్లాట్లు ఇవ్వలేదని, పైగా రాజ‌ధానిని త‌ర‌లించాల‌న్న ప‌ని వేగ‌వంతం చేస్తున్నారంటూ  ఆందోళనలో  అమ‌రావ‌తి రైతులు ఆగ్ర‌హంతో ఊగిపోతున్నారు. పేదల ఇళ్ల స్ధలాలకు రాజధాని భూములే కావాలా అంటూ వారు మండి ప‌డుతున్నారు. 

నిజానికి అమ‌రావ‌తి భూములు నాణ్య‌మైనవి కాద‌ని,  క‌ట్ట‌డాల‌కు ప‌నికి రానివ‌ని, వ‌ర‌ద‌లొస్తే మునిగి పోతాయ‌ని, 1000తో అయ్యే ప‌నికి అక్క‌డ ల‌క్ష ఖ‌ర్చు చేయాలంటూ చెప్పిన ప్ర‌భుత్వం ఇప్పుడు ఇళ్ల పట్టాలంటూ ఆశ‌లు రేప‌టం వెనుక రాజ‌కీయ కోణ‌మే కాదు. అక్క‌డి రైతుల ఉద్య‌మాన్ని నిలువ‌రింప చేయ‌ట‌డమ‌న్న ఆరోప‌ణ‌లు వెల్లు వెత్తుతున్నాయి. త‌మ‌ని పెయిడ్ ఆర్టిస్టుల‌ని చెప్పిన  ప్ర‌భుత్వ పెద్ద‌లు త‌మ‌కు మ‌ద్ద‌తుగా ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టుల‌ను రంగంలోకి దించుకున్నార‌ని మండి ప‌డుతున్నారు. పేద‌ల‌కు ఇళ్లు ఇవ్వ‌టానికి తాము అభ్యంత‌రం చెప్ప‌డంలేద‌ని ల‌క్ష‌ల్లో ఖ‌ర్చ‌ని, ఇదో స్మ‌శాన‌మ‌ని, ప‌నికి రాని స్థ‌ల‌మ‌ని నానా యాగి చేసి మ‌రి ఇక్క‌డ స్థ‌లాలిచ్చి పేద‌ల‌ను మ‌రింత పేద‌లుగా మార్చేస్తారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published.