అమరావతిపై గవర్నర్ ఎటువైపు?

రాజధాని అమరాతిని విశాఖ నగరానికి తరలించేందుకు వీలుగా రాజధాని అనే పేరు లేకుండా అభివృద్ధి విస్తరణ పేరుతో ఈ రోజు శాసనసభలో బిల్లు ప్రవేశ పెట్టేందుకు జగన్ప్రభుత్వం సిద్దమైంది. ఉదయాన్నే కేబినెట్ సమావేశం ఈ బిల్లును ఆమోదించి, ఆపై శాసనసభలో తనకున్న భారీ మెజార్టీతో ఆమోదింప చేసుకుని మండలికి పంపే అవకాశం ఉంది. మండలిలో తెలుగుదేశం పార్టీ మెజార్టీ సభ్యులతో ఉన్నందున అక్కడ చర్చ జరిగినా… ఒక్క రోజులో దీనికి సవరణలు సూచించి తిరస్కరించినా, ప్రభుత్వం తను అనుకున్న లక్ష్యమే నెరవేరాలని దీనిని నేరుగా ఆ బిల్లు గవర్నర్ కి పంపాలని యోచిస్తున్నట్టు కనిపిస్తోంది.
శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆమోద ముద్ర వేయవచ్చు.. లేదా ఆపవచ్చు… లేదా శాసనసభ ఈ విధంగా బిల్లు ఆమోదించింది దీనిపై ఆమోద ముద్ర వేయవచ్చా అని న్యాయ శాఖ సలహా కోరవచ్చు. ఇవన్నీ కాదనుకున్న పక్షంలో కేంద్ర పరిశీలనకు పంపే అధికారాలు గవర్నర్కు ఉన్నాయి.
అసలు రాజధాని మార్పు బిల్లును ఇప్పటి వరకు గవర్నర్ దృష్టికి ముఖ్యమంత్రి జగన్ తీసుకెళ్లినట్టు కనిపించడం లేదన్నది ఏపి రాజకీయ విశ్లేషకులు చెపుతున్న మాట. ఇప్పటికే ఒకవైపు రాజధాని ప్రాంతంలో రైతులు గత నెల రోజులుగా చేస్తున్న ఆందోళనలు, పోలీసుల లాఠీ ప్రయోగాలు, ఆంక్షలు, మహిళలపై ఖాకీలు చూపిస్తున్న కర్కశాలను దేశ వ్యాప్తంగా ఉన్న వార్తా సంస్ధలు పుంఖనాలుగా ప్రచురిస్తునే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీతో సహా విపక్షాలన్ని ఏకమై జేఏసి ఏర్పాటు చేసి రాజధాని తరలింపుపై చేస్తున్న నిరసనలతో పరిస్థితి మరింత ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అటు అధికార పక్షం మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీలు తీసినా, అవి కేవలం ఉత్తరాంధ్ర జిల్లాలలకే పరిమితమై ఉన్నాయన్నది వాస్తవం.
రాయల సీమ జిల్లాలకు హైకోర్టు తరలిస్తామని ప్రభుత్వం చెపుతున్నా ఇప్పటికిప్పుడు ఇది సాధ్యం కాదన్నది న్యాయ నిపుణులే చెపుతున్న మాట. హైకోర్టుతో పాటు రాజధాని కర్నూలుకు తరలించాలన్నది ఇక్కడి వారి ప్రధాన డిమాండ్. విశాఖ చాలా దూరంగా ఉంటుందని, సచివాలయ పనులు ఉంటే చేసుకునేందుకు ఇబ్బంది కలుగుతుందని, దానిని అమరావతిలోనే కొనసాగించాలన్నదీ వారు చెపుతున్న మాట.
అయితే ఇవేవీ పరిగణలోనికి తీసుకోని ఏపి సర్కారు తను అనుకున్న మాట చెల్లుబాటు అయ్యేందుకు ఈ రోజు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరచింది. బిల్లుపై అంతా అనుకూలంగా మాట్లాడాలని శాసనసభ్యులకు హెచ్చరికలూ వైసిపి జారీ చేసింది
మరోవైపు మండలిలో ఇబ్బందులు ఉన్నందున తూతూ మంత్రంగానే పని కానిచ్చేసి శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్ కు పంపేయాలని నిర్ణయించుకుంది. అయితే అమరావతి ప్రాంత ప్రజలు ఎన్నో రోజులుగా శాంతియత దర్నాలపై పోలీసులు దౌర్జన్యం చేయటంపై… ఇప్పటికే హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేసారు. అలాగే అమరావతి రాజధాని మార్పుపై కొంతమంది పిటీషన్ దాఖలు చేసినప్పుడు కోర్టు.. బిల్లును ఆమోదించినట్లు ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు.. ఆయా ఉత్తర్వులు వెలువడ్డాక ఆ కేసును విచారణ జరుపుతామని అంతవరకు మీరు వేసిన పిటిషన్ను అంగీకరిస్తున్నామని న్యాయమూర్తులు పేర్కొనటాన్ని సైతం గవర్నర్ పరిగణలోనికి తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ కేసు విషయమై పూర్వా పరాలను గవర్నర్ ఆరా తీసినట్లు తెలిసింది.
అయితే తాము పంపే బిల్లుపై గవర్నర్ తప్పనిసరిగా ఆమోద ముద్ర వేస్తారని జగన్కు, ఆయన మంత్రి వర్గ సహచరులు ధీమా వ్యక్తం చేస్తున్నా, శాసనసభ ఆమోదించిన బిల్లును యదావిదంగా ఆమోదిస్తే రాష్ట్రంలో మరిన్ని ఉద్రిక్తతలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని కొందరు రాజ్యాంగ నిపుణులు గవర్నర్కు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు తగినట్టే ప్రత్యామ్నాయ కారణాలు అనేకం ఉన్న నేపధ్యంలో గవర్నర్ తీసుకోబోయే నిర్ణయంపై అమరావతి రాజధాని భవిష్యత్తు ఆదారపడి ఉందన్నది వాస్తవం. ఒకవేళ ప్రభుత్వ పెద్దలు చెపుతున్నట్ట గవర్నర్ ఈ బిల్లును ఆమోదించినా… ఇప్పటికే ఈ విషయంపై న్యాయ వ్యవస్థ లో దాఖలైన పలు కేసుల దృష్ట్యా కలుగజేసుకునే ఆస్కారం లేక పోలేదు.
ఏది ఏమైనా గవర్నర్ తనకు అందిన సమాచారాలను బేరూజు వేసుకుని తీసుకునే నిర్ణయాన్ని బట్టి పరిస్థితులు ఎలా మారనున్నాయో వేచి చూడాలి.