ప్రియాంక ఘటనపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.

శంషాబాద్ అత్యాచార, హత్య ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించారు. ప్రగతి భవన్లో ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్.. డాక్టర్ ప్రియాంక రెడ్డిపై జరిగిన ఘాతుకాన్ని ప్రస్తావించి, తీవ్ర ఆవేదన చెందారు. మహిళా ఉద్యోగులకు రాత్రిపూట డ్యూటీలు వద్దని చెప్పారు. మానవ మృగాలు మన మధ్యే తిరుగుతున్నాయని కలత చెందారు. ఇది దారుణమైన అమానుషమైన దుర్ఘటనగా ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యురాలి హత్యకేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కేసు సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను సీఎం కోరారు.