తన ఇంటిని కంచి మఠానికి అప్పగించేందుకు నెల్లూరు చేరుకున్నబాలసుబ్రమణ్యం

లెజెండరీ సింగర్, ఎస్పీ బాలసుబ్రమణ్యం మరోమారు తన పెద్దమనసు చాటుకున్నారు. నెల్లూరులో . తిప్పరాజువారి వీధిలోని ఉన్న తన ఇంటిని కంచి మఠం సంస్కృత- వేద పాఠశాలను స్థాపించడానికి వితరణగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బాలు చాలా కాలం క్రితం తన ప్రకటన చేసినా బుధవారం ఆయన కంచి మఠానికి అప్పగించేందుకు నెల్లూరు విచ్చేసారు.
తన ఇంటికి సంబంధించిన పత్రాలను మఠం కు కానుకగా ఇస్తున్నట్టు రిజిస్ట్రేషన్ వగైరాలు పూర్తి చేసి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీకి అప్పగించారు.
నెల్లూరు నగరంలో పూర్తి వాణిజ్య ప్రాంతంలో బాలూకి ఉన్న ఇంటిని కొనుగోలు చేసేందుకు అనేక వాణిజ్య సంస్ధలు ప్రయత్నించాయి. ఇందుకు పెద్ద ఎత్తున చెల్లించేందుకు ఆఫర్లు వచ్చినప్పటికీ, బాలూ అంగీకరించకుండా, స్వస్ధలంలో తనకున్న మంచి పేరు నిలవాలంటే ఓ ధార్మిక సంస్ధకు విరాళంగా ఇవ్వటమే మంచిదన్న నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
ప్రపంచ సినీ చరిత్రలో అత్యధిక చలనచిత్ర పాటలు (16 భారతీయ భాషలలో 40,000 పాటలు) పాడినందుకు గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకున్న బాలూ ప్రస్తుతం చెన్నైలో స్థిరపడ్డారు. నెల్లూరులోని అతని ఇల్లు చాలా ఏళ్లుగా మూతబడి ఉంది. ఒక్కో పర్యాయం బాలూ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే ఆ ఇంటిని తెరచి శుభ్రపరిచేవారు. ఏది ఏమైనా బాలూ తీసుకున్న నిర్ణయం మన వేదాలను పది మందికి పంచేలా చేస్తుందని, కంచి మఠం కూడా ఇక్కడ , వేద పాఠశాలని ఏర్పాటు చేయటంతో పాటు అనుబంధంగా ఓ ఆలయాన్నినిర్మించే ఆస్కారం ఉందని సమాచారం.