స్వచ్ఛ భారత్‌కు రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త నిర్ణయం

మీకు కిల్లి, గుట్కా, పాన్‌ మసాలా తినే అలవాటు ఉందా?, లేదంటే సిగరెట్లు తాగుతూ ఉమ్ములు వేసే అలవాటు ఉందా? అయితే మీకో చేదువార్త.. ఇకపై ఉమ్ములు గానీ.. చెత్తగానీ ఎక్కడ పడితే అక్కడ వేయడానికి కుదరదు. ప్రాముఖ్యంగా మీరు రైల్వేస్టేషన్‌కెళ్తే మరి జాగ్రత్త. ఎక్కడపడితే.. అక్కడ ఇష్టమొచ్చినట్లు ఉమ్ములు వేయడం గానీ.. చెత్త వేయడం గానీ చేస్తే మీ జేబు ఖాళీ అవ్వడం ఖాయం.
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. స్వచ్ఛ భారత్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే రైల్వేలో కూడా ఆధునీకరణకు పెద్ద పీట వేస్తోంది. ఇప్పటికే రైల్వే బోగీలను ఆధునీకరిస్తున్నారు. తాజాగా రైల్వే స్టేషన్లను, వాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త నిర్ణయం తీసుకుంది. 
ఇకపై ఎవరైనా కావాలని చెత్తవేసినా, మూత్రం పోసినా, గోడలను పాడు చేసినా ఉపేక్షించకూడదని నిర్ణయించింది. అటువంటి వారిని గుర్తించి జరిమానాలు వసూలు చేయాలని నిశ్చయించింది. ‘స్వచ్ఛ భారత్‌ మిషన్‌’లో భాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమం అన్ని డివిజన్లలోను అమలు చేయనున్నట్టు తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. 
ఈ జరిమానాలు ఈ నెల పదో తేదీ నుంచే అమలులోకి వస్తాయని తెలిపింది. స్టేషన్‌ కేటగిరీని బట్టి జరిమానాలు ఉంటాయి. స్టేషన్‌ మేనేజర్లు, సూపరింటెండెంట్లు, కమర్షియల్‌, ఆపరేషనల్‌ విభాగాల్లో టిక్కెట్‌ కలెక్టర్‌, ఆపై స్థాయి అధికారులు, గజిటెడ్‌ అధికారులు, ఆర్‌పీఎఫ్‌ అధికారులు జరిమానాలు విధించవచ్చు.
జరిమానాలు ఈ విధంగా…
చెత్తాచెదారం వేస్తే… రూ.100 నుంచి రూ.200
వంట చేస్తే రూ.500
ఉమ్మితే…రూ.200 నుంచి రూ.300
మూత్రం పోస్తే…రూ.300 నుంచి రూ.400
పక్షులు, జంతువుల ఆహారం వెదజల్లితే రూ.300 నుంచి రూ.500
పాత్రలు కడిగినా, దుస్తులు ఉతికినా రూ.300 నుంచి రూ.500
రైల్వే ఆవరణలో అనుమతి లేని నిల్వలు చేస్తే రూ.5,000
అనుమతి లేకుండా పోస్టర్లు అతికిస్తే…రూ.1,000 నుంచి రూ.2,000
అమ్మకందారులు డ్రై, వెట్‌ వేస్ట్‌లకు వేర్వేరు బిన్లు పెట్టకపోతే…రూ.వేయి నుంచి రూ.2 వేలు.
50 మైక్రాన్ల కంటే తక్కువ ప్లాస్టిక్‌ ఉపయోగిస్తే…రూ.300 నుంచి రూ.500

Leave a Reply

Your email address will not be published.