సింగిల్ విండో పై హర్షం
కేంద్రం తాజా బడ్జెట్లో వినోదరంగంపై తీసుకున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తమవుతోంది. 28 శాతం జీఎస్టీ చెల్లింపు.. టిక్కెట్టు పై వడ్డనలు అంటూ తెగ భయపెట్టేసిన కేంద్రం ప్రస్తుతం దిగొచ్చింది. బడ్జెట్లోనే ఊరట కలిగించే నిర్ణయాల్ని ప్రకటించి కొంతవరకూ మేలు చేయడంపై టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంతకీ కేంద్ర బడ్జెట్లో కీలకంగా తీసుకున్న నిర్ణయం ఏది? అంటే…తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్లో జీఎస్టీ దెబ్బకు కునారిల్లుతున్న సినీ రంగంపై వరాల జల్లు కురిపించారు. ఇకపై ప్రాంతీయ చిత్రాలకు సింగిల్ విండో పద్ధతిలో షూటింగ్‌లకు అనుమతి ఇవ్వనున్నట్టుగా ప్రకటించారు. ఇప్పటి వరకు విదేశీ చిత్రాలకు మాత్రమే ఈ విధానం అమల్లో ఉంది. తాజా ప్రకటనతో స్వదేశీ చిత్రాలకు ఈ విధానం అమలవుతుంది. సినిమా టికెట్లపై ఇదివరకూ రూ.18 శాతం నుంచి 28 శాతం వరకూ టిక్కెట్టు బాదుడు ఉండేది. దానిని (జీఎస్టీని) 12 శాతానికి తగ్గిస్తున్నట్టుగా బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. సినీరంగాన్ని పట్టి పీడిస్తున్న పైరసీని అరికట్టేందుకు యాంటీ కామ్ కార్డింగ్ ప్రొవిజన్ యాక్ట్‌ను సినిమాటోగ్రఫి చట్టానికి జత చేయనున్నట్టుగా ప్రకటన వెలువడింది. ఈ నిర్ణయాలతో ఇకపై వినోద రంగం మరింతగా పరుగులు పెట్టేందుకు ఆస్కారం లభించనుంది. అయితే ప్రకటనలు ఘనం.. పనులు శూన్యం అన్న చందంగా కాకుండా యుద్ధప్రాతిపదికన ఈ విధానాన్ని వెంటనే అమలు చేయాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.