రాజధాని వ్యవహారానికి బ్రేక్ పడినట్లేనా..?

ఏపీ లో మూడు రాజ‌ధానుల వ్య‌వ‌హారంలో క‌మిటీలు నివేదిక‌లు ఇవ్వ‌క ముందే త‌న ప‌రివారంతో బైట‌, శాస‌న‌స‌భ‌లో త‌ను ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ, ఎంతో దూకుడుగా క‌నిపించిన వైఎస్సార్సీపీ అధినేతకు బ్రేకులు ప‌డ్డట్టే క‌నిపిస్తోంది.  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తాజాగా జ‌రుగుతున్న వ‌రుస  ప‌రిణామాలు ఇందుకు తార్కాణంగా క‌నిపిస్తోంది. వాస్త‌వానికి రాజధాని   విష‌య‌మై అమీ తుమీ తేల్చేస్తామంటూ స‌మావేశ‌మైన ఏపీ క్యాబినెట్. త‌మ భేటీలో తుది నిర్ణ‌యం తీసుకుని ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పి నివేదిక‌లు చ‌ర్చించేందుకు మ‌రో క‌మిటీని, ఆపై హైప‌ర్ క‌మిటీని వేసి కాల‌యాప‌న‌కు శ్రీ‌కారం చుట్టినట్టే క‌నిపిస్తోంది. ఇలా వెన‌క్కి త‌గ్గ‌డం  వెనుక బ‌లమైన కార‌ణం ఉంద‌నిపిస్తోంది. అందుకే కేబినెట్ భేటీ మ‌రుసటి రోజే  విశాఖ ఉత్స‌వ్‌లో పాల్గొనేందుకు వెళ్లిన  సీఎం నోరు మెద‌ప‌క‌పోవ‌డం మ‌రింత బ‌ల‌ప‌రుస్తోంది. 

ఈ నేప‌థ్యంలో రాజ‌ధాని మార్పుల‌ను ఎవ‌రో అడ్డుకుంటున్నార‌న్న సందేహాలు జ‌నం మ‌దిలోనే కాదు వైసిపి నేత‌ల మ‌స్తిష్కంలోనూ పెరుగుతున్నాయి. ఈ వ్య‌వ‌హారం అటు తిరిగి ఇటు తిరిగి ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీ ప్ర‌భుత్వానికి  గుదిబండ కాబోతోంద‌న్న‌ సందేహాలు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే వైసీపీలోని ఒక్కొక్క‌రూ త‌మ జిల్లాలో రాజ‌ధానులు పెట్టాలంటూ గొంతు స‌వ‌రించుకుంటు, పార్టీలో ఏర్ప‌డుతున్న‌ విబేధాలను దృష్టిలో ఉంచుకుని జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గ‌టం వ‌ల్లే విశాఖ ప్ర‌జ‌లు ఆశ‌గా ఎదురు చూసినా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేద‌ని ఓ వ‌ర్గం మీడియా అంటుంటే,  కేంద్రం నుంచి వ‌చ్చిన పిలుపులు, వేసిన కొర్రీలే అని మ‌రోవ‌ర్గం చెపుతోంది.  
ద‌క్షిణాఫ్రికా త‌ర‌హాలో మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌ను  ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల‌లో వైసిపి ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర్ నాథ్ తో స‌హా ప‌లువురు  మాట్లాడినా , సిఎం జ‌గ‌న్ లేచి మూడు రాజ‌ధానులు ఉంటాయేమో అన‌టంతో  రాష్ట్రంలో  ర‌చ్చ మొద‌ల‌య్యింది. దీనికి అనుగుణంగానే  జీఎన్ రావు క‌మిటీ రిపోర్ట్ వ‌చ్చింది. బీసీజీ గ్రూప్ మ‌ధ్యంత‌ర నివేదిక కూడా ఇచ్చింది. ఈ నివేదిక‌ల‌పై కేబినెట్‌లో చ‌ర్చించి నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించే ఆస్కారం ఉంద‌ని  అంతా ఆశిస్తే అనూహ్యంగా క్యాబినెట్ భేటీలో మ‌రో క‌మిటీకి రూప‌క‌ల్ప‌న చేసి చేతులు దులుపుకున్నారు. ఆపై హైప‌వ‌ర్ క‌మిటీ మూడు వారాల్లో నివేదిక అంటూ వెల్ల‌డించారు. అయితే బొత్స స‌త్య‌నారాయ‌ణ ప‌దే ప‌దే మీడియాలో మాట్లాడుతూ తామేం చేయ‌బోతున్నామో ఇట్టే చెప్పేస్తునే, నివేదిక అందిస్తామంటూ చెపుతున్నారు. అయితే జ‌గ‌న్ విశాఖ‌లో ప్ర‌క‌ట‌న చేస్తార‌ని ప్ర‌క‌టించిన సాయిరెడ్డికి సైతం ఆత‌ర‌హా సూచ‌న‌లు లేక‌పోవ‌టంతో య‌ధాశ‌క్తి త‌న యుద్ధాన్ని విప‌క్షం అడ్డుకుంటోంద‌ని ట్వీట్ల‌లో ప్ర‌క‌టిస్తునే ఉన్నారు. రాజ‌ధాని వ‌స్తే అభివృద్ధి చెందాల్సిన ప్రాంతాల‌ను అడ్డుకుంటున్నార‌ని ఆడిపోసుకుంటునే ఉన్నారు. 
అయితే  ఏపి క్యాబినెట్ స‌మావేశం జ‌రిగిన రోజే సీఎం క్యాంప్ ఆఫీసులో మాజీ కేంద్ర‌మంత్రి సురేష్ ప్ర‌భు జ‌గ‌న్ తో ప్ర‌త్యేకంగా భేటీ కావ‌టం,  వారిరువురు మ‌ధ్య అనేక అంశాల‌పై కీల‌క చ‌ర్చ‌లు సాగిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. కానీ అవి ఏమిట‌న్న‌ది ఇత‌మిద్దం బైట‌కు రాకున్నా, రాజ‌ధాని మార్పు విష‌యంలో స్థానిక బిజెపి నేత‌లు అందించిన నివేదిక‌తో జ‌గ‌న్ అత్యుత్సాహానికి క‌ళ్లెం వేయాల‌ని భావించిన‌ కేంద్ర ప్ర‌భుత్వం  త‌న త‌రుపున దూత‌గా సురేష్ ప్ర‌భు ను పంపిన‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సురేష్ ప్ర‌భు వ‌చ్చిన స‌మ‌యంలో అమ‌రావ‌తిలో రైతులు చేస్తున్న నిర‌స‌న‌లు కూడా ఆయ‌న కారులోంచే ప‌రిశీలించార‌ని, ఈ స‌మాచారం కూడా కేంద్ర పెద్ద‌ల‌కు అంద‌టంలో  రాజ‌ధాని ర‌గ‌డ‌కు తాత్కాలికంగా ముగింపు ప‌ల‌కాల‌ని కేంద్రం పెద్ద‌లు జ‌గ‌న్ కి సూచిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికిప్పుడే  రాజ‌ధానిపై ముందుకెళ్ల‌డం స‌రికాద‌ని   సున్నితంగానే  జ‌గ‌న్ ప్ర‌తిపాద‌న‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌టంతో పాటు ఓ త‌ర‌హా వార్నింగ్ కూడా ఇచ్చిన‌ట్టు క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కుల మాట‌. 
మోడీ శంకుస్థాప‌న చేసిన అమ‌రావ‌తిని అర్థాంత‌రంగా ముగించాల‌ని చూడ‌టంపైన సురేష్ ప్ర‌భు త‌న‌ అభ్యంత‌రాలు  జ‌గ‌న్‌కి తెలిపారని, తాము రాజ‌ధానిగా అమ‌రావ‌తిని కూడా ఉంచుతామ‌ని ఎడ్యుకేష‌న‌ల్ హ‌బ్‌గా ఇండ‌స్ట్రీ కారిడార్‌గా మారుస్తామంటూ జ‌గ‌న్ చెపుతున్నా అది జ‌రిగే ప‌ని కాద‌ని , ఈ పేరుతో రైతుల నుంచి తీసుకున్న భూములు త‌న ప‌రివారానికి క‌ట్ట‌బెట్టేందుకే ఈ నిర్ణ‌యంగా క‌నిపిస్తోంద‌ని సురేష్ ప్ర‌భు మండి ప‌డిన‌ట్టు స‌మాచారం. 
 ఇప్ప‌టికే  త‌మ‌కు జ‌రుగుతున్న అన్యాయంపై రాజ‌ధాని రైతులు  నేరుగా ప్ర‌ధానికి లేఖ‌లు రాయ‌గా, కొంద‌రు బీజేపీ నేత‌లు, ఉప రాష్ట్ర‌ప‌త్రి వెంక‌య్య కూడా ఈ అంశం కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు స‌మాచారం.  ఈ విష‌యంలో  వైసీపీ మిన‌హా దాదాపుగా అన్ని పార్టీలు అమ‌రావ‌తికి మ‌ద్ధ‌తుగా నిలుస్తుండ‌గా  కొంద‌రు నేత‌లు నేరుగా రంగంలోకి దిగి నిర‌స‌న‌లు చేస్తుంటే , వైసిపికి చెందిన రైతులు కూడా ఆందోళ‌న‌ల‌లో పాలుపంచుకోవ‌ట‌మే ఆ పార్టీ నేత‌ల‌కు న‌చ్చ‌డం లేదు. స‌మ‌స్య ప‌రిష్కారంపై చిత్త‌శుద్ది లేని నేత‌లు కొంద‌రు   ప్ర‌క‌ట‌న‌లు చేస్తుండ‌టంతో ఆందోళ‌న‌ల‌కు ఆజ్యం పోస్తోంది. 
అయితే అమ‌రావ‌తి నుంచి క‌ర్నూలుకి హైకోర్ట్ ని త‌ర‌లించాలంటే రాష్ట్ర‌ప‌తి గెజిట్ లో మార్పులు అవ‌స‌రం అవుతాయి.అదే స‌మ‌యంలో అమ‌రావ‌తిని ఏపీ రాజ‌ధానిగా గుర్తించిన త‌రుణంలో కేంద్రం మూడు రాజ‌ధానుల‌కు   అనుగుణంగా మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వ్య‌వ‌హారాలు కేంద్రం చేతుల్లో ఉన్నందున అటు నుంచి కొర్రీలు ప‌డితే జ‌గ‌న్ అడుగులు త‌డ‌బ‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. 
ఈ క్ర‌మంలో విజ‌య‌సాయిరెడ్డిని ఢిల్లీ రావాల‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు చెప్ప‌డంతో ఏం జ‌రిగ‌నే విష‌యంపై ఓ అంచ‌నాకి రాలేక పోయినందునే ముందు క‌మిటీలు వేసి త‌రువాత చూద్దామ‌ని జ‌గ‌న్ త‌ప్పించుకున్న‌ట్టు స‌మాచారం. దాంతో జ‌గ‌న్ నోటి నుంచి విశాఖ‌కి వ‌రాల జ‌ల్లు కురిపిస్తార‌ని ఆశించిన వారికి విశాఖ ఉత్స‌వ్ వేదిక నిరాశ‌ను మిగిల్చింది. ప్ర‌స్తుతానికి ఆయ‌న రాజ‌ధాని విష‌యంలో మౌనంగా ఉండ‌డం మిన‌హా మ‌రో దారి క‌నిపించ‌డం లేద‌ని కొంద‌రు చెబుతున్నారు.
ఇంగ్లీష్ మీడియం విష‌యంలో ల‌భించిన మ‌ద్ధ‌తు  మూడు రాజ‌ధానుల‌పై జ‌గ‌న్ కి ద‌క్క‌క పోవ‌టంతో డిల్లీ వెళ్లి బీజేపీ పెద్ద‌ల‌ను  స్వ‌యంగా జ‌గ‌న్  క‌లిసేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. వ‌చ్చే వారంలో అవి ఫ‌లిస్తే అక్క‌డే తేల్చుకోవాల‌ని భావిస్తున్న క్ర‌మంలో వ్య‌వ‌హారం మ‌రింత ముదురుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. జ‌గ‌న్ 3 క్యాపిటల్ అంశం కొలిక్కి వ‌స్తుందా..కొత్త స‌మ‌స్య తెస్తుందా అన్న‌దే జ‌నం మ‌దిలో రేగుతున్న ప్ర‌శ్న‌లు. మ‌రేం జ‌ర‌గ‌నుందో వేచి చూడాలి కొన్నాళ్లు.

Leave a Reply

Your email address will not be published.