‘అమరావతి’ మున్సిపాలిటీ ఏర్పాటు దిశగా ప్రభుత్వం కసరత్తు

ఇప్పటికే తాడేపల్లి, మంగళగిరి మండల పరిధిలోని గ్రామాలను స్థానిక పురపాలక సంస్థల్లో కలుపుతున్నట్లు ప్రకటించి, రాజధాని పరిధి నామమాత్రంగా మార్చేసిన ప్రభుత్వం తాజాగా రాజధాని పరిధిలోని తుళ్లూరు మండలంలోని గ్రామాలన్నింటిని కలిపి అమరావతి మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తున్నట్టు కనిపిస్తోంది.
వైసిపి ప్రభుత్వంఅధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో అమరావతి గ్రేటర్ ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆ పార్టీ నేతలు ప్రచారం చేసారు. అయితే ప్రస్తుతం ఉన్న జనాభా సరిపోక పోవటంతో కార్పొరేషన్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే తుళ్లూరు మండలంలో కొన్ని గ్రామాలను రాజధాని పరిధి నుండి మినహాయించిన విషయం తెలిసిందే వీటన్నింటినీ కలిపి మున్సిపాల్టీగా ఏర్పాటు చేసి, పట్టణాభివృద్దిశాఖ ద్వారానే పనులు జరపాలని నిర్ణయించారు.
ఇటీవల స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలనే చర్చ మొదలైన తదుపరి రాజధాని పరిధిలోని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని తేల్చి చెప్పిన ప్రభుత్వం లేఖలో పేర్కొన్నారు. అదే సమయంలో రాజధాని పరిధిలోకి వచ్చిన తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని గ్రామాలను కూడా మాస్టర్‌ప్లాను నుండి విడదీసి, కొత్తగా ఏర్పాటు చేయనున్న మున్సిపాలిటీల పరిధిలోకి చేర్చింది. కాగా ఈ అంశంపై పలువురు రైతులు కోర్టును ఆశ్రయించినా, అమరావతి పరిధి తగ్గించే ప్రక్రియని కొనసాగిస్తూ, మున్సిపాలిటీగా మార్చడానికి అవసరమైన ప్రక్రియ వేగవంతం చేయాలని పట్టణాభివృద్ధిశాఖకు ప్రభుత్వం ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది.