పురాలపై కాషాయ పట్టు ఫలించేనా?
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మనమేఅధికారంలోకి వచ్చేస్తామని అటు కాంగ్రెస్, ఇటు బిజెపీ నేతలు కలలు కన్నారు. ఆ క్రమంలోనే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ను ఎట్టి పరిస్థితులలోనూ విభజించాల్సిందేనని ఇక్కడి నేతలంతా తమ తమ కేంద్ర నాయకత్వాలపై చేసిన వత్తిడి అంతా ఇంతా కాదు… `మేము మద్దతు ఇస్తాం… దమ్ముంటే విభజన బిల్లు తీసుకు రండి’ అంటూ అప్పట్టి బిజెపి అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ సవాల్ విసిరితే…. మీకు చేత కాకుంటే మేమే అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్నిస్తాం… ఇందుకు అనుగుణంగా ఎప్పుడో మేం నిర్ణయం తీసుకున్నామంటూ కాకినాడ తీర్మాణాన్ని తెరపైకి తీసుకువచ్చారు నేతలంతా… దీంతో అటు తెలంగాణ ఉద్యమాన్ని అదుపు చేయలేక ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్, కేసీఆర్‌తో పలు పర్యాయాలు మాట్లాడి… తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పిన మీదట గత్యంతరం లేని పరిస్థితిలో యుపిఎ ప్రభుత్వంలోని పార్టీలని ఒప్పించి మరీ ఏపి రాష్ట్ర విభజన పక్రియను షురూ చేసింది కాంగ్రెస్. అన్ని అవాంతరాలను దాటుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనా… కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయకపోగా తామే పాలిస్తామంటూ నొక్కివక్కాణించడంతో అటు బిజెపి, ఇటు కాంగ్రెస్‌లు తామే తెలంగాణ ఇచ్చిందని చెప్పుకున్నా, పెద్దమ్మ సోనియా… చిన్నమ్మ సుష్మా అంటూ ప్రచారం చేసినా ఎన్నికల నాటికి ఫలితం అందుకోలేక పోయాయి. కేసీఆర్ వ్యూహాల ముందు వెనకబడిపోయిన ఈ పార్టీలు విజయ తీరాలకు సుదూరంగానే నిలబడాల్సి వచ్చింది. దీనికి తోడు బంగారు తెలంగాణా పిలుపు అందుకుని కాంగ్రెస్, టిడిపిల నుంచి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు టిఆర్ ఎస్‌లోకి జంప్ కావటమే కాదు… ఏకంగా శాసనసభా పక్షాలని సైతం విలీసనం చేసిన సందర్భాలు చూసాం.
అయితే తెలంగాణ లో వేళ్లూరుకోవాలని ప్రయత్నిస్తున్న బిజెపి పరిస్థితి ఏ మాత్రం మెరుగు పడటం లేదు. ఆ మధ్య జరిగిన పార్లమెంటు ఎన్నికలలో నాలుగు స్ధానాలు దక్కించుకున్నా… ఆ పై స్ధానిక ఎన్నికలలో చతికిల్లబడటం అది బలుపు కాదు వాపని, అభ్యర్దులు స్దానిక అంశాలతోనే గెలిచినా… హామీలు నిలుపుకోలేక పోవటం వల్లే జనం ఝలక్ ఇచ్చారంటారంతా… కనీసం బలమైన అభ్యర్థులను ఎంపికలో పార్టీ విఫలమవుతుంటే… పలువురు టి ఆర్ ఎస్ తో కుమ్మక్కై, తమ ఏజెంట్ల ఫారాలను ఆ పార్టీ అభ్యర్థులకు `అమ్ముకున్నారు’ అనే ఆరోపణలు బోలెడున్నాయి. శాసనసభ ఎన్నికలలో పలువురు జంప్ జిలానీలకు టిక్కెట్లు ఇచ్చినా… వారు గెలవలేదు సరికదా… ఎన్నికల తర్వాత ఆ పోటీ చేసిన వారెవ్వరూ పార్టీలో మిగలనే లేదు.
అంతెందుకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లో తమ ప్రభావం తీవ్రంగా ఉంటుందని భావించే నేతలు టిడిపి పొత్తుతో ఐదుగురు ఎమ్యెల్యేలతో పాటు అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ ఉన్నా… సహితం తమ తమ నియోజకవర్గాలలో గత గ్రేటర్ ఎన్నికలలో ఒక్కరిని కూడా గెలిపించలేక పోయారు. బిజెపి ఎమ్మెల్యేలు లేని చోట మాత్రం ఐదుగురు కార్పొరేటర్లు గెలుపొందారు.
ముందస్తు అసెంబ్లీ ఎన్నికలలో టిడిపితో పొత్తుకు ముందే కటీఫ్ చెప్పిన బిజెపి.. చివరి నిమిషంలో అభ్యర్థులు దొరకక జంపింగ్లకి టిక్కెట్ ఇచ్చారు. చివరికి మతాన్ని అడ్డు పెట్టుకుని గెలవాలనుకుని హిందూ ధర్మ ప్రచారకుడిగా ఉన్న పరిపూర్ణానంద స్వామి కి కూడా కాషాయకండువా కప్పి మరీ పార్టీలోకి తీసుకువచ్చారు. ఆయన కూడా తన శక్తి వంచనలేకుండా తెలంగాణ అంతటా విస్తృతంగా పర్యటించి 70 సీట్లు గెలుస్తున్నామని ప్రగల్భాలు పలికారు అందరి రాజకీయనేతలలానే. కానీ అయితే పాతబస్తీలో రాజాసింగ్ కి సీట్ ఇవ్వద్దని మొత్తం పార్టీ నేతలు పట్టుబట్టినా సీటు దక్కించుకున్న సిట్టింగ్ ఎమ్యెల్యే గా ఆయన ఒక్కడు మాత్రమే పార్టీ సత్తా కన్నా, వ్యక్తిగత బలంతో `సొంతంగా’ గెలుపొందటం కొసమెరుపైంది ఆ పార్టీకి.
తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ చతికల బడటంతో మోదీ ప్రభంజనంతో ఇక తెలంగాణ మాదే అంటూ మళ్లీ వాస్తవాలు మరచి మరీ త్వరలో జరుగనున్న మునిసిపల్ ఎన్నికలలో తమ సత్తా చూపించి పాగా వేస్తామంటూ బీరాలు పలుకుతున్నారు. అసలు మున్సిపల్ ఎన్నికలలో కనీసం వార్డుల వారీగా సరైన అభ్యర్థులను ఎంపిక చేసి, నిలబెట్టగల సామర్ధ్యం మనకుందా అన్న సామాన్య కార్యకర్తలే విస్మయం చెందుతున్నారంటే పరిస్దితి అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు తమ తమ నియోజకవర్గాలలో కనీసంఒకక్క పురపాలక సంఘంలో బిజెపిని గెలిపించగలరా? అన్నది ప్రశ్నే. కేవలం ప్రెస్ మీట్ లకే పరిమితం అవుతున్న నేతలతో తెలంగాణలో బిజెపి బలంగా ఉందంటూ ఊకదంపుడే తప్ప, వాస్తవంగా క్షేత్ర స్దాయిలో జరుగుతున్న తతంగాలను పరిగణలోనికి తీసుకున్నప్పుడే బలం పుంజుకుంటామని ఎప్పటికి తెలుసుకుంటారోనని ఆ పార్టీ వర్గాలే చెపుతున్నాయి. ఈ నేపథ్యంలో పుర ఎన్నికలలో కాషాయ జండా రెపరెపలపై కమలనాధులలోనే శతకోటి అనుమానాలున్నాయి. మరి వీటిని పటాపంచలు చేసి ఎంతవరకు పాగా వేస్తారో చూడాలి.