ఉద్యోగసంఘాల నాయకులు స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారా..?

ఆంధ్రరాష్ట్ర విభజన జరిగాక హైదరాబాదులో పదేళ్లు ఉండే అవకాశం ఉన్నప్పటికీ అనేక రాజకీయ కారణాలతో వెలగపూడిలో సచివాలయం నిర్మించి ఉద్యోగులను తరలించాలనుకున్నప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాల నాయకులు తాజాగా అమరావతి రాజధానిని విశాఖ నగరానికి మార్చాలని ముఖ్యమంత్రి పరోక్షంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ ఏ ఒక్కరూ నోరు మెదపటం లేదట.
అప్పట్లో ఉద్యోగ సంఘ నాయకులు సమావేశం నిర్వహించి మనకు హైదరాబాదులో పదేళ్లు ఉండే అవకాశం ఉంది. ఆ గడువుకు ముందే వెలగపూడి, గుంటూరుకు తరలి వెళ్లాల్సిన అవసరం ఏమిటి అని అభ్యంతరం వ్యక్తం చేసిన ఉద్యోగసంఘ నాయకులు తాజా పరిణామాలతో మౌనం వహిస్తున్నారట. ఒకానొక సమయంలో మేము వెలగపూడి కి రాము… హైదరాబాదులోనే ఉంటాము.. ఇంత త్వరగా వెలగపూడి వెళ్లాల్సిన అవసరం ఏమిటి అని అన్న నాయకులకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నచ్చ చెప్పారు.. వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కలుగజేస్తామని చెప్పి ఒప్పించారు. ఆ తరువాత చంద్రబాబు ఆ మాట నిలబెట్టుకున్నారు. హైదరాబాదు నుండి వచ్చిన వారికి ఉచిత నివాసాలు ఏర్పాటు చేశారు. ఇదంతా గతం..
తాజాగా అమరావతి రాజధానిని విశాఖ తరలించటంపై ఆగ్రహం చెంది కొన్ని జిల్లాల ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఆందోళన చేస్తున్నా… ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్‌రెడ్డి, ఏపి జేఏసి ఛైర్మన్‌ (రెవిన్యూ సంఘ అధ్యక్షులు) బొప్పరాజు వెంకటేశ్వర్లు, సచివాలయ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు మిగతా ఇతర నాయకులు రాజధాని తరలింపుపై అభ్యంతరం వ్యక్తం చేయటం లేదట. అంతే కాకుండా రాజధాని తరలింపుపై ఎన్జీవో సంఘ నాయకులతో కనీసం మాట వరుసకైనా జగన్‌ ఇప్పటి వరకు చెప్పలేదట. కానీ ఆ ఎన్జీవోల నాయకులు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సచివాలయాన్ని, హెచ్‌వోడీలను విశాఖకు తరలిస్తే అక్కడ పని చేసేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. ఈ నాయకులందరూ జిల్లాల ఉద్యోగ సంఘాల నాయకులు అభిప్రాయం కోరలేదు. సచివాలయ, హెచ్‌వోడీలలో పని చేస్తున్న ఉద్యోగులు, క్రింది స్థాయి అధికారుల అభిప్రాయాన్ని కనీసం మర్యాద పూర్వకంగా అయినా అడగలేదట. ఈ నాయకులందరూ పరస్పరం పోటీ పడుతూ ముఖ్యమంత్రి జగన్‌ మెప్పు పొందేందుకు ఉద్యోగులతో చర్చించకుండానే తాము విశాఖ నగరానికి తరలి వస్తామని చెప్పటంలో మర్మం ఏమిటి.. అని అంటున్నారు.
2019ఎన్నికల సమయంలో ఉద్యోగ సంఘాల నాయకులు నిర్వహించిన పాత్ర ఉద్యోగులందరికీ తెలుసు. హైదరాబాదు నుండి వెలగపూడికి తరలి రావాలని చంద్రబాబు కోరినప్పుడు ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. ఘాటైన పద జాలాలతో మాట్లాడిన ఉద్యోగ సంఘ నాయకులు మౌనం వహించారు. ఇంత వరకు రాజధాని తరలింపుపై మంత్రి వర్గం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటి వరకు పరోక్షంగా ముఖ్యమంత్రితో పాటు అనేక మంత్రులు అభిప్రాయాన్ని వెల్లబుచ్చారే తప్ప స్పష్టమైన ప్రకటన చేయలేదు. కానీ ఎన్జీవోల నాయకులు అప్పుడే అమరావతి నుండి సచివాలయం, హెచ్‌వోడీలను తరలించబోతున్నారు అన్నట్లుగా అత్యుత్సాహంతో ఉద్యోగుల అభిప్రాయాలను తెలుసుకోకుండా ఏక పక్షంగా వ్యవహరించారని ఉద్యోగులు దుయ్యబడుతున్నారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులైతే ఈ నాయకులు వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఏది ఏమైనా ఉద్యోగసంఘాల నాయకులు స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు అని అనుకుంటున్నారు. 

Leave a Reply

Your email address will not be published.