కేసీఆర్ ది జ‌న‌రంజిక పాల‌నా?


తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావు ఈ ఏడాది కాలం పూర్త‌యింది. ఈ ఏడాది కాలంలో ఆయ‌న‌ జ‌న‌రంజిక పాల‌న కొన‌సాగించారు. ప్ర‌తి ఎన్నిక‌ల్లో  స్థానిక ఎన్నిక‌ల్లో, ఉపఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఓటు ద్వారా ఆయ‌న పాల‌న‌ను ఆమోదించారు. కానీ… ఎన్నిక‌ల స‌మంచ‌లో ఆయ‌న ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన కొన్ని హామీలు మాత్రం గాలికి వదిలేశారు. రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది గడిచినప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంలా ఉంది. కేసీఆర్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఒక్క హామీని కూడా నేరవేర్చలేదు. పైగా అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలపైనే కాలం వృధా అయిందని తెలుస్తుంది. ఎన్నికల్లో గెలిచేందుకు బాగా ఉపయోగపడిన రైతు బంధు పథకాన్ని కూడా కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన‌ట్లుక‌నిపిస్తుంది. ఖరీఫ్ సీజన్ రైతు బంధు ద్వారా చాలా మంది రైతుల ఖాతాల్లో జమ కాలేద‌ని కొంద‌రు రైతులు ఆరోపిస్తున్నారు.  5 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు రైతుబంధు డబ్బులు ఇంకా తమ ఖాతాల్లో పడలేదు. రబీ సీజన్ కూడా మొదలైనప్పటికీ ఖరీఫ్ డబ్బులు రాకపోవడంతో ఇంతకు వస్తాయా రావా అనే మీమాంసలో రైతులు ఉన్నట్లు తెలిసింది. రైతులకు ఒక లక్ష రూపాయల వరకూ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకూ రుణమాఫీ ఏ విధంగా చేస్తారో కూడా మార్గదర్శకాలను రూపొందించలేదు.

ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 61ఏళ్లకు పెంచనున్నట్లు మ్యానిఫెస్టోలో పొందుపర్చారు. కానీ ఇప్పటికీ వేలాది మంది ఉద్యోగులు రిటైరయ్యారు. కానీ వయో పరిమితి పై చర్చ కూడా జ‌ర‌ప‌లేద‌ని స‌మాచారం.  ప్రభుత్వ ఉద్యోగులు కూడా కేసీఆర్ వైఖరీపై నిరాశతో ఉన్నట్లు సమాచారం. రెవెన్యూశాఖలో సంస్కరణల పేరుతో ఉద్యోగులను ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేస్తుంది. దీంట్లో భాగంగానే పదుల సంఖ్యలో రెవెన్యూ ఉద్యోగులు తనువు చాలించిన విషయం తెలిసిందే. భూ సర్వే రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన రెవెన్యూ ఉద్యోగుల ఇబ్బందులకు గురి చేయడం పై ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. అదను దొరికితే ప్రభుత్వంపై తిరగబడాలని ఎదురు చూస్తున్న ప‌రిణామాలు తెలుస్తున్నాయి.

ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తామని 2014 సాధారణ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చారు. కానీ ఇప్పటి వరకూ వాటిని పూర్తిస్దాయిలో అమలు చేయలేదు. పైగా రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలోనే డబుల్ బెడ్ రూమ్ లు ఇచ్చినట్లు అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారం తెలుస్తున్నది. దీన్నిబట్టి ఈ సారి కూడా డబుల్ బెడ్ రూమ్ లు లేనట్లే. రాష్ట్రంలో కేజీ టూ పీజీ వరకూ ఉచిత విద్యను అమలు చేస్తామని 2014, 2018 ఎన్నికల మ్యానిఫేస్టోలో పెట్టారు. కానీ ఇప్పటి వరకూ అమలుకు నోచుకోలేదు. పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సంఖ్యను పెంచామని ప్రభుత్వం చెబుతున్నది. కానీ వీటిలో పరిమిత సంఖ్యలోనే విద్యార్థి, విద్యార్థినులకు సీట్లుంటాయి. అంతేకాకుండా ఈ విద్యాసంస్థల్లో కేజీ టూ పీజీ అమలు కావడం లేదు. ఒక పక్కా గురుకుల సంఖ్య పెంచుతూనే.. విద్యార్థుల సంఖ్య లేదని ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి 6శాతమే ఖర్చు చేస్తున్నట్లు అధికారులు ఇచ్చినట్లు లెక్కల ప్రకారం తెలుస్తుంది.

పేదల ఆరోగ్యం పట్ల కూడా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించడం లేదు. పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం కల్పించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ అద్భుతంగా పనిచేస్తుందని ప్రకటించింది. కానీ ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్న ఆసుపత్రులకు పెండింగు బిల్లులను ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో రోగులకు కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి 3.5శాతమే ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. దీన్ని పై ప్ర‌భుత్వం కాస్త శ్ర‌ద్ధ వ‌హిస్తే బావుంటుంది.

ఆసరా పథకం కింద వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత, గీత,  బీడీ కార్మికుల పింఛన్లను రెట్టింపు చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించింది. కొత్త పింఛన్ దారులకు 65ఏళ్ల నుంచి 57ఏళ్లకు వయో పరిమితిని తగ్గించనున్నట్లు వెల్లడించింది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకుగానూ పెరిగిన పింఛన్ డబ్బులను ప్రభుత్వం చెల్లించలేదు. కొత్త పింఛన్ దారులకు వయో పరిమితి తగ్గింపుపై ఇప్పటి వరకూ మార్గదర్శకాలను విడుదల చేయలేదు. పైగా దరఖాస్తులను కూడా స్వీకరించడం లేదు. దీంతో రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులు పింఛన్లు కోసం ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రోల్ బ్యాక్ అయిన పింఛన్లదారులకు ఇప్పటి వరకూ పించన్లు రాలేదు. సుమారు ఏడాదిన్నర నుంచి రోల్ బ్యాక్ అయిన పింఛన్ దారులు ఎదురుచూస్తున్నారు. లిక్కర్ ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. నూతన మద్యం పాలసీ ద్వారా ప్రభుత్వం రూ. 22వేల కోట్లు దండుకునేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. దరఖాస్తుల ద్వారా రూ.980కోట్లను ప్రభుత్వం లబ్ధిపొందిన  విషయం తెలిసిందే. 


Leave a Reply

Your email address will not be published.