రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ అధిష్టానం అండ

అనుమతి లేకుండా డ్రోన్ కెమరాతో మంత్రి కేటీఆర్ ఫాంహౌస్‌ను చిత్రీకరించిన కేసులో అరెస్టు కాబడి చర్లపల్లి జైల్లో ఉన్న మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి మరోమారు బైలు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ఆయన తరుపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ బృందం హైదరాబాద్ వచ్చి ఈ మేరకు ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో 3 పిటిషన్లు దాఖలు చేశారు.
పార్లమెంట్ సమావేశాలకు హాజరుకావాల్సి ఉన్నందున తక్షణం బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో ఓ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అలాగే నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో రేవంత్‌పై అక్రమంగా కేసును నమోదు చేసారని, దానిని కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ తో పాటుగా మియాపూర్ కోర్టు విధించిన రిమాండ్ రద్దు చేయాలని మరో పిటిషన్ ను సల్మాన్ ఖుర్షీద్ దాఖలు చేసింది.
కాంగ్రెస్ సీనియర్ నేత అయిన సల్మాన్ ఖుర్షీద్ రేవంత్ కేసులు వాదించేందుకు సిద్దం కావటం వెనుక అధిష్టానం అండ కూడా ఉందని వినిపిస్తోంది. కాంగ్రెస్ సీనియర్లు రేవంత్‌పై అనేక దూషణ భూషణలు చేసినా, మీడియాకెక్కి రచ్చచేసినా, సోనియాకు రేవంత్‌పై వ్యతిరేకంగా చెప్పినా కాంగ్రెస్ అధిష్టానం చొరవ తీసుకుని రేవంత్ రెడ్డి కేసులను వాదించేందుకు సల్మాన్ ఖుర్షీద్ నేతృత్వంలోని న్యాయవాదుల బృందాన్ని హైదరాబాద్ పంపడం పార్టీలోని రేవంత్ వ్యతిరేక వర్గీయులను ఖంగుతినేలా చేసిందనే చెప్పాయి.