చుక్కల్లో చంద్రికలు

చుక్కల్లో చందమామ ఎంత అందంగా ఒద్దికగా ఉంటుందో.. అదే తీరుగా ఇక్కడ అందాల చందమామలు అంతే అందంగా ఒద్దికగా కనిపిస్తున్నారు. ఒకరిని మించి ఇంకొకరు అన్న చందంగా అందాల భామలు కొలువుదీరి ఉన్నారు. గ్లామర్ ప్రపంచంలో కెరీర్ పరంగా నెగ్గుకు రావడం అంటే అంత సులువేమీ కాదు. నిరంతరం మోడలింగ్ ప్రపంచం నుంచి పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే కొత్తందాల తాకిడిని తట్టుకోవాలి. ఇరుగు పొరుగు భాషల నుంచి ప్రవాహంలా నటీమణుల రాక కనిపిస్తోంది.  అందంతో పాటు నటన ఇంపార్టెంట్. అభినయం .. ఆహార్యంలో రాణించాలి. అన్నీ ఉన్నా అదృష్టం కలిసి రావాలి. సరైన టైమ్ లో సరైన టైమింగ్ తో సినిమాలు హిట్టయితేనే ఇక్కడ అవకాశాలు ఉంటాయి. అసలే సెంటిమెంటు పరిశ్రమ కావడంతో సక్సెస్ అనేది ప్రతిదీ నడిపిస్తోంది. ప్రతియేటా రెండు డజన్ల పైగానే కొత్త ముఖాలు తెలుగు సినిమా తెరపై కనిపిస్తున్నాయి. అయితే వీళ్లలో ఎందరు ఉంటున్నారు.. ఎందరు వెళుతున్నారు? అన్నది అర్థం కాని పరిస్థితి.

శ్రీయ, ప్రణీత, కేథరిన్ సీనియర్ నాయికలు. ఐదు పదేళ్లుగా ఈ రంగంలో రాణిస్తున్నారు. 40కి దగ్గర పడుతున్నా శ్రీయ ఇప్పటికీ టీనేజీ భామలకు పోటీనిస్తోంది. ప్రణీత, కేథరిన్ తెలుగులో అంతగా రాణించలేకపోయినా ఇరుగు పొరుగు భాషల్లో వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. తెలుగమ్మాయ్ ఇషారెబ్బ నవతరం ప్రతిభావనిగా గుర్తింపు తెచ్చుకుంది. అగ్ర హీరోల సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటోంది. మన దర్శక నిర్మాతల నుంచి బోలెడంత ప్రోత్సాహం అందుకుంటున్న భామగా పాపులరైంది. అను ఇమ్మాన్యుయేల్ ఆరంభమే స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ సరసన నటించింది. నాని, రాజ్ తరుణ్ వంటి హీరోలతో సక్సెస్ లు అందుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో అంత హవా లేకపోయినా ఈ భామకు అవకాశాలు కొదవేమీ లేదు. కుమారి 21 ఎఫ్ చిత్రంతో హెబ్బా పటేల్ అనూహ్యంగా దూసుకొచ్చి పెద్ద స్టార్ అయిపోయింది. వరుసగా డజను సినిమాల్లో నటించిన ఈ బ్యూటీని ఇటీవల సక్సెస్ ముఖం చాటేసింది. ఎక్కడికి పోతావు చిన్నవాడా?  తర్వాత మరో హిట్టు కోసం వేచి చూడాల్సిన సన్నివేశం నెలకొంది. మాళవిక శర్మ మాస్ మహారాజా రవితేజ సరసన ‘నేల టిక్కెట్’ అనే చిత్రంలో నాయికగా నటించింది.

నితిన్ సరసన ‘చిన్నదాన నీకోసం’ చిత్రంలో కథానాయికగా నటించిన మోడల్
కథానాయిక  మిస్తీ చక్రవర్తి ఆ తర్వాత టాలీవుడ్ లో కనిపించలేదు. సక్సెస్ రాక.. అదృష్టం కలిసి రాక ఈ భామలు స్టార్ డమ్ ని అందుకోవడంలో తడబడ్డారు. అయినా ప్రయత్న ం మాత్రం వీడలేదు. రియా, తాన్య,  అష్న, సంయుక్త .. వీళ్లంతా నవతరం నాయికలు. ఆకట్టుకునే క్యారెక్టర్లు తమవైపు వస్తే నటించేందుకు .. తమని తాము నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ భామలకు మల్లూవుడ్ సహా కన్నడ సినీరంగం నుంచి భారీగానే కాంపిటీషన్ ఉంది. మరోవైపు ముంబై మోడలింగ్ ప్రపంచం నుంచి నిరంతరం మోడల్స్ రాక పోటీని పెంచుతోంది. చుక్కల్లో చంద్రికలా ప్రత్యేకతను నిలుపుకోవాలంటే ఈ పోటీని ఎదుర్కోక తప్పదు.

Leave a Reply

Your email address will not be published.